జీవిత నావ

ఆనందంగా సాగిపోతున్న 
జీవితమనే ఒక నావ...
అందులోకి ఎక్కే వారు.... 
గమ్యం రాగానే దిగేవారు
కొందరు మిగిలి పోతారు...
చక్కని మిత్రులుగా...
కొందరిని మరిచిపోతాము....
 యాదృచ్చికంగా...
కొందరు  పయనిస్తారు  
మనతో కడదాకా...
ఆజన్మ ఋణాను బంధగా... 
ఆత్మీయులుగా....


అలా నావలోకి ప్రవేశించి....
మొదట యాదృచ్చికమై...
క్రమేణా హితమై...స్నేహితమై..
బంధమయి... మరి అనుబంధమై...
అమాయకంగా...ఆదరంగా..
అభిమానంగా, ఆరాధన  కురిపిస్తే...

ఆ అనురాగ ప్రపంచం లోని 
ఊహల పల్లకి లో రాణినై...మహారాణినై
అభిమానం వర్షంలో తడిసి ముద్దై...
అర్థం కాక, ఆలోచనల కు 
అందక ఉక్కిరిబిక్కిరై....
అది కలయా,భ్రమయా తెలియని
ఒక వింత అనుభూతి కి బానిసనై....

మొదట అలవాటై
ఆపై కమ్మని ఎదురుచూపై
చివరకు వ్యసనమై....
నమ్మాలో  వద్దో... కావాలో వద్దో
తగునో తగదో... అనే అంతులేని
ఆత్మక్షోభ కు లోనై....

ఒప్పుకోలేక....వదులుకోలేక
దాచుకోలేక....చెప్పుకోలేక
మరిచిపోలేక, మరుపు రాక
అందుకోలేక...బయటపడలేక

మిగిలిపోయాను...
సునామీ లో చిక్కిన నావలో...
లేని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ
నిబ్బరంకై ప్రయత్నిస్తూ....
ఆత్మస్థైర్యాన్నికూడ గట్టుకుంటూ...
ఆనందాన్ని నటిస్తూ...
గమ్యాన్ని అంచనా వేస్తూ...

Comments

Post a Comment