పిల్లలు -పేర్లు

 వెనకటికి పిల్లలు పుడితే దేవుళ్ళ పేర్లు, పురాణాల్లోని పాత్రల పేర్లు  లేదా ఇంట్లో పెద్ద వాళ్ళ జ్ఞాపకార్థం వారి పేర్లు పెట్టేవాళ్ళు.

ఉదాహరణకి అబ్బాయిలకు  రాము, కృష్ణ, శివుడు, సుబ్రమణ్యం, రఘు అదే అమ్మాయిలైతే మహా లక్ష్మి, సీత,రాధ,దుర్గ, రుక్మిణి ,సావిత్రి , సుమిత్ర  (దాదాపుగా) ఉండేవి. తర్వాత కాలంలో కొంచెం మార్పు తో పూల పేర్లు చామంతి ,రోజా, లిల్లీ    అబ్బాయిలకు రాజు, శ్రీనివాస్ ,మహేందర్, నరేష్ వగైరాలు  వచ్చాయి.  బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో రాణు ల పేర్లు వారి చెలికత్తెల  పేర్లు భలే ఉండేవి. చారుమతి, అవంతిక,సుగంధిక,చంపక, కళావతి,పారిజాతం అంటూ.

కొందరు ఇంట్లో అందరికి "నాగ" వచ్చేలా చాలా మంది "సాయి" పేరు లో ఉండేలా పెడతారు వారి వారి నమ్మకాలను బట్టి.(నాగార్జున, నాగ చైతన్య, నాగ వెంకట్ లాంటివి) సాయి వయితే నేను చెప్పవసరం లేదు.

తర్వాత మంచి అర్థం ఉన్న పేర్లు కొత్తగా ఉండేవి పెట్టాలని తల్లి తండ్రులు భావించారు.విరించి, స్థితప్రజ్ఞ, ఐశ్వర్య, విహారి, నిహారిక లాంటివి .

అప్పట్లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు  ఉండేవారు. అందరికి ఒకే అక్షరం తో మొదలయ్యేలా లేదా ముగిసేలా పేర్లు పెట్టారు.  ( ప్రశాంతి, ప్రసన్న, ప్రవీణ్ , ప్రణతి)  …అప్పట్లో సౌకర్యాలు లేక పిల్లలు ఊరికే పుట్టి చనిపోతుంటే పెంటమ్మ, పెంటయ్య(పెంటపై పారేస్తామని,అలా అంటే బ్రతుకుతారని) బుచ్చమ్మ ,పిచ్చమ్మ అని కుడా పేర్లు పెట్టేవారు.అలాగే పుణ్యక్షేత్రాలు ఉన్నావద్ద ఆ ప్రసిద్ధమైన దేవత లేదా దేవుడు పేరు విరివిగా పెడతారు. (కొమరయ్య, యాదగిరి,నరసిమ్హా, మల్లయ్య(మల్లేష్),వెంకటేష్ లాంటివి .

ఇక రానురాను భిన్నంగా ఉండాలని చిత్ర విచిత్రమైన పేర్లు  పెట్టడం మొదలయ్యింది. ఊహ,జిన,రియ,మహిమ, భూమి, అన్వేష్, థ్రిల్లెష్  లాంటివి.

యశస్వి శ్రీవాత్సవ చక్రవర్తి(అసలు పిలిచే పేరు చక్రి ), శ్రీనివాస ప్రాజ్ఞ శ్రీభవన్( షార్ట్ కట్ శ్రీని అయ్యింది), సాత్విక్ విద్వోత్తం (చివరికి సత్తి), మనోజ్ఞ  రాగ ఝరి,సుహృద్ శ్రీమాన్ విరాజ్ అని రెండు మూడు పేర్లు కూడా పెట్టారు, ( అప్లికేషన్ ఫార్మ్ లో నింపడానికి గడులు సరిపోక ఏది రాయాలో,ఏది వద్దో అర్థం కాకుండా తిప్పలు పడడానికి)

ఈ మధ్య మా ఇంట్లో అయితే శ్రీహాన్, శ్రీయాన్, శ్రియాన్ష్, శ్రిత, శ్రీహిత, శ్రీకృతి, శ్రేయసి, తనరిక, విహాన్,రిహాన్,రిషాన్,విరాజ్,వివస్వన్, వివస్వంత్,  వేదాన్ష్,అవ్యుక్త్,అతులిత్,అథర్వ్ లాంటి పేర్లు వచ్చేసాయి.

త్వరలో ప్రత్యేకంగా ఉంటాయని క్రిమి, కీటక్(కీటక - అమ్మాయయితే) విషణ్ణ్, స్వభావ్, సంకుచిత్, కంకణ్, ఆవేదన,ఆచరణ, అకుంఠిత,విరక్తి, సమస్య, సమాస, చికిత్స,కానుక ,ఆహార, నిబంధన్, పరిహార్, ఆసక్తి, ఆశ్చర్య, సోపాన, సందిగ్ధ ,  సంకట్  లాంటివి పెట్టినా అసలు ఆశ్చర్య పోవక్కర్లేదు.  ( అర్థం ది ఏముందిలే ఎవ్వరికి ఉండని కొత్తదై ఉండాలి)

గడచిన కాలం స్వర్ణయుగం, అప్పటి పేర్లు ఆపాత మధురాలు లాగా మహాలక్ష్మి,గాయత్రి, కాత్యాయిని,రాము్, కృష్ణ, మాధవన్, విష్ణు, సిద్ధార్థ్ లాంటివి మళ్ళీ వినబడుతున్నాయి.

ఆ మధ్య మాకు తెలిసిన ఒక అమెరికన్ కు ఇలా మనకు పేర్లకు వచ్చిన తిప్పల గురించి చెప్తే ఆయన నవ్వి మేమయితే పలికేందుకు, గుర్తుపెట్టుకునేందుకు వీలయిన పేర్లు ఎంత సింపుల్ గానో పెట్టుకుంటాం అను ఉదాహరణకి జో, చార్లి, మార్క్, ఫిలిప్, అందులో ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఫిలిప్ జూనియర్, ఫిలిప్ సీనియర్ అని కుడా పెట్టుకుంటాం అని నవ్వుతూ చెప్పాడు.

Comments