మానవ సంబంధాలు, నిర్వాహణ పుస్తకాలలో చదువుకున్నoత వీజీ ఏమీ కాదు. రాకుంటే అంత కంటే క్లిష్టమైనది మరేమీ ఉండదు.
ఏదో సాధారణ గృహిణి జీవితం గడుపుతున్న కూడా ఏదో ఒక నాడు ఒక వ్యాపార వేత్తనో ఒక కంపెనీ కి వైస్ ప్రెసిడెంట్ నో అయిపోవాలని కలలు కంటున్న నాకు ఒక అతి క్లిష్టమైన మానవ సంబంధాలు , ప్రజాసేవల కు సంబంధించిన ఉద్యోగం దొరికింది.
మొదట్లో మనసులో భయంగా ఉన్నా మీదికి గాంభీర్యం ప్రదర్శిస్తూ.. తర్వాత తర్వాత రాటు తేలానని భ్రమ పడుతున్న నాకు కాదని ప్రతి రోజూ బోధపడుతున్నది.
ఇందులో మొదటగా చెప్పుకోవలసిన వారు మా డ్రైవర్లు. నా మొదటి డ్రైవర్ డ్రైవర్ల వృత్తి లోనే ఘనాపాటి . దాదాపు పుష్కర కాలం ఇక్కడ డ్రైవర్ గా పనిచేయడం వల్ల ఇనస్పెక్షన్ లో నేనేమీ చేయాలో నాకంటే ఆయనకే బాగా తెలుసు (అనుకుంటాడు ). నేను చేరిన మొదట్లో బయల్దేరగానే మా అన్ని విభాగాల స్టాఫ్ను అక్కడికి రమ్మని నా తరపున ఆర్డర్లు వేసేవాడు. చాలా చురుకైనవాడు. కాకపోతే కొన్నిసార్లు అదే ఇబ్బందికరంగా ఉండేది. అవసరం ఉన్నవి లేనిది అన్నిట్లో తల దూర్చేవాడు. ఒక్కరోజు నేను లేటు గా వెళ్లాలని 9 గంటలకు రమ్మంటే రోజూ లా ఆరు గంటలకే వచ్చాడు. ఎందుకు అని అడిగితే షడన్ గా పై ఆఫీసర్లు మిమ్మల్ని రమ్మంటే ఇబ్బంది పడతారు కద అందుకే వస్తాను..మీరు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాo అని చెప్పి నాకు కనబడకుండా దూరంగా ఉండేవాడు. నా ముందు ఆఫీసర్లు వాడిన చిట్కాలు చేప్పేవాడు. అలా తనను తాను రథసారథి పార్థుడు లాగా, గీతా ఉపదేశం చేసే చిన్నపాటి కృష్ణుడు లాగా కూడా అనుకునే వాడు. మా పగలు రాత్రి లేని లేని తిమిర ఉద్యమం లో (ఉద్యోగం లో) జ్యోతి లా దారి చూపుతూ ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఆగిపోతుందో- ఎప్పుడు పొగలు కక్కుతుందో తెలియని కాలం చెల్లిన బొలెరోను శుభ్రంగా తుడిచి మల్లె పూవులాంటి తువ్వాలు సీట్లపై పరిచి బెంజ్ లో వచ్చినట్లు గర్వముతో నడిపేవాడు.
ఎప్పుడైనా బొలెరో వద్దు అద్దె కార్లు తీసుకుందాం అంటే వేటగాడి బాణానికి గాయపడిన జింక లా విలవిల లాడేవాడు. మీకేమి తెల్సు మేడమ్ బొలెరో విలువ మీరు మొత్తం హైదరాబాద్ లో ఈ బండి లో ఎక్కడికి వెళ్లినా ఆపే వాళ్లే ఉండరు, మీకు ఇందులో వెళ్తే నే గౌరవo దొరుకుతుంది అనేవాడు.
అలా అతను బెంచ్ మార్క్ సెట్ చేసిన తర్వాత వేరే చోట ఉన్న డ్రైవర్ కు దార్లు మాత్రమే బాగా తెలుసు అంతే. వాళ్ల పని ఏంటి? బండి నడపడం ! అది ఒక్కటి చేసేవారు. ఇద్దరు డ్రైవర్ లు ఉండేవారు. అక్కడే సంవత్సరాల తరబడి చేశారు కాబట్టి దార్లు తెలిసేవి ,కాని మిగిలిన విషయాలు పెద్ద పట్టేవి కాదు. కరెక్ట్ టైమ్ కి ఇంటి ముందు ఉండేవారు. ఆరు అంటే ఆరు, ఒక నిమిషం అటు ఇటు కూడా అయ్యేది కాదు. ఒక అతను బండిని జాగ్రత్త గా నడిపేవాడు ఎక్కువ కుదుపులు లేకుండా, ఇంకొకరు మాత్రం లారీని నడుపుతున్నట్టుగా నడిపేవాడు, విసుర్రాయి తో పిండి విసిరినట్టుగా అనిపించేది ఆ కుదుపులకు. పొట్ట ,బరువు ఏమైనా తగ్గానేమో అని చూసుకునే దాన్ని వారం వారం. ఈ మధ్య యోగా లో విసిరే ఎక్స్ ర్సైజ్ చాలా పాపులర్ కదా (శిల్పా శెట్టి చేసి చూపిస్తుoది ). జిల్లాల కు వెళ్ల కుండా టైమ్ కలిసి వచ్చింది ,ఏమీ జరిగినా మన మంచికే అనుకున్నా. గ్రాము బరువు కూడా తగ్గక పోగా త్వరలోనే నడుము నొప్పి వచ్చింది నాకు.
మరో ప్లేస్ లో పాత డ్రైవర్ లు అనారోగ్య కారణాల వల్ల మానేశారు. కొత్త వాళ్లు ఇద్దరు వచ్చారు. మా ఉద్యోగం లో రోజు ఫీల్డ్ విజిట్ తప్పనిసరి. ఏరియా, దార్లు తెలవక పోతే చాలా కష్టం. ఎందుకంటే ఈ విషయంలో నేను అంతంతే. బ్రైన్ లో తొందరగా రిజిస్టర్ కావు. టైమ్కు ఆ స్థలానికి వెళ్లక పోతే పై ఆఫీసర్లు వెళ్లిపోవడం, అక్కడి వాళ్లు మన కొరకు ఎదురుచూడడం, ఫోన్ లు చేయడం నాకూ చాలా ఎబ్బెట్టు గా అనిపించే విషయాలు.
ఈ కొత్త వాళ్ళు రైట్- లెఫ్ట్ బ్యాచ్, గూగుల్ మ్యాప్ పై ఆధారం అన్నమాట. ఒకవేళ గూగుల్ వాడు మ్యాప్ ఆప్ కనిపెట్టకపోతే నా బ్రతుకు బస్టాండ్ అయ్యేది. దారిలో అందర్నీ ఆపి అడిగి వెళ్లే లోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోయేది . నాకు కూడా దారులు అంత తొందరగా గుర్తు ఉండవు, అయినా నాకెందుకు ఉండాలి నేను డ్రైవర్ ని కాదుగా ....
టైమింగ్ విషయానికి వస్తే 6 కు రమ్మంటే 6:30 కు వస్తారు, అదేమని అంటే రోజు ఏదో ఒక సాకు అందుకే నేనేప్పుడు వెళ్లినా 6 గంటలకే వచ్చేలా చూసుకుంటా. ఈ మధ్య వస్తున్న అకాల వర్షాలకు కార్లో నుంచి గొడుగు తీయి అన్నా, మొదట లేదని తర్వాత తీశాడు ఒకటి. తెరవడానికి మీట నొక్కగానే ఒక కిలో దుమ్ము రాలింది పురావస్తు శాఖ తవ్వకాలలో డిక్కీ లో దొరికిన ఆ గొడుగులో ...ఇంకా నయం తలపై పెట్టుకొని తెరవలేదు.. అంత మెయిన్టెనెన్స్ అన్నమాట.
వచ్చి రెండు నెలలు గడిచినా ఒక ఇరవైసార్లు ఇనస్పెక్షన్కు వెళ్లిన మెయిన్ రోడ్డు పై ఉన్న ప్రముఖమైన పార్కు పేరు చెప్పి పద, అరగంటలో అక్కడికి అందరూ వస్తున్నారు అన్నా. ముఖం చూడాలి...బండి అయితే బయలు దేరింది కాని పిచ్చి చూపులు చూస్తూ నడుపుతుoటే డౌట్ వచ్చి అడిగా..తెలుసా ఎక్కడికి వెళ్లాలి ?? అని , లేదు అన్నట్టుగా దృఢముగా తల ఊపాడు . మరి అడగవే అన్నా కోపంగా. ఏదో కొంచం కొంచం గుర్తు ఉంది అదా కాదా అని ఆలోచిస్తున్న అన్నాడు. కరెక్టు ఇరవై నిమిషాల్లో అక్కడ ఉండాలి ఇప్పుడు ఆలోచిస్తే ఎలా?? అన్నా కోపాన్ని పెదవులలో నొక్కిపెడుతూ ..
రోజూ వెళ్లే దారిలోనే ప్రతి జంక్షన్ దగ్గర రైటా , లెఫ్టా స్ట్రైటా అని పిచ్చ కన్ఫ్వూషన్ మనవాడికి . ప్రతి చోటా ఆగి ఆలోచిస్తూ ఉంటాడు. టైమ్ ఉంటే తానే నిర్ణయం తీసుకోని అని వదిలేస్తా లేకుంటే ఒక కంట కనిపెడు తుంటా. ఇక మరోకతను నీటుగా ఇస్త్రీ నలగని బట్టలతో వస్తాడు ఉదయం ఐదు గంటలకు వచ్చిన కూడా. బండి ఆపగానే దిగి చేతులు వెనక కట్టుకొని సీరియస్ గా మా టీంతో పాటు నడుస్తుంటాడు. తనే ఇనస్పెక్షన్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ అన్నట్టుగా..కరెక్టుగా బయల్దేరె సమయానికి కనపడడు. అక్కడ ఇక్కడ చూసి ఫోన్ చేస్తే ఇక్కడే పక్కకు ఉన్న మేడమ్ అంటూ వస్తాడు అందరూ వెళ్లి పోయాక. అంతసేపు ఉన్నవాడు కొంపలు మునిగినట్టు అప్పుడే ఎక్కడికో వెళ్లి .
ఏదేమైనా ఫీల్డ్ జాబ్ చేసే నావంటి వాళ్లకు మంచి చురుకైన, గడుసైన డ్రైవర్ ఉండడం చాలా చిన్న విషయం అయినా ఎంతో అవసరం.
Comments
Post a Comment