అలివేలు పిట్టకథలు-షర్టు

అలివేలు పిట్టకథలు-షర్టు

అమ్మా.... నాకు ఒక బాబుదన్నా సారుదన్నా ఒక షర్టు కావాలి అని నసుగుతూ అడిగింది అలివేలు.

షర్టా.. ఏం షర్టు? టీషర్టా?ఫార్మల్ షర్టా?  అని అడిగాను.
 నిండా చేతులు ఉంటాయి కదా అదే అన్నది.

ఎందుకు అలివేలు సడన్ గా ఇప్పుడు షర్టు?.. అని అడిగాను.

ఏం లేదమ్మా పని చేసేటప్పుడు ఫోన్ వస్తే.. ఫోన్ పెట్టుకోటానికి జేబు ఉంటుంది కదా అని అన్నది. 
ఒక్కసారి షాక్ అయ్యాను. తనకున్నది చిన్న నోకియా ఫోన్. తనకొచ్చే మహా ఫోన్లు తన కూతురో, అమ్మనో ఎప్పుడో ఒకసారి కొడుకు చేస్తాడు. వాళ్ళ ఆయన ముత్యాలు మాత్రం ఎప్పుడూ చేయడు. ఇక కూతురు ఫోన్ వచ్చిందా ఇక అంతే సంగతులు. ఆ అమ్మాయి ఇంటికి వినబడేలా గట్టిగా మాట్లాడుతుంది. ఇంట్లో ఏం వండారు.. ఏం బట్టలు వేసుకున్నారు..ఏం తిన్నారు..దగ్గర నుంచి మాట్లాడుతారు.

మేము అదిలించి పని కానీ అలివేలు.. లేట్ అవుతుంది అందరం ఆఫీస్ లోకి వెళ్ళాలి అనేదాకా. ఇప్పుడు అది బయటపెట్టి పనిచేస్తుంటే వినపడదట అందుకని జేబులో పెట్టుకుంటుందట. సర్సర్లే షర్ట్ లేదు ..ఏం లేదు.. ఫోన్ పక్కన పెట్టు అన్నాను.అదేదో నేను సుద్దపూసనయినట్టు!
లేదమ్మా ఇయ్యవా "ప్లీజ్" అంది. ఈ ఇంగ్లీష్ ఒకటి బానే వచ్చింది నల్గొండ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత. 
మర్నాడు మా బాబు ఏదో షర్ట్ కి కొంచెం మరకలు అయిందని అమ్మా ఇంక ఈ షర్టు గుడ్ విల్ స్టోర్ కి ఇచ్చేయ్ అని నాకు ఇచ్చాడు. ఎంత కాదన్నా వెంటనే అలివేలు అడిగిన విషయం గుర్తుకొచ్చి అలాగే తీసిపెట్టి మర్నాడు ఉదయం.. ఇదిగో అలివేలు ఫోన్ పెట్టుకోవడానికి జేబు ఉన్న షర్టు అని ఇచ్చాను.

 అంతే  ముఖం  అమెరికా లో న్యూ ఇయర్ కి కాల్చే రంగురంగుల వింత వింతైన టపాకుల్లా వెలిగిపోయింది. వెంటనే వేసుకొని చూసింది సరిగ్గా సరిపోయింది. మీ ఆయనదో, మీ బాబుదో అడగొచ్చు కదా అని అన్నాను. లేదమ్మా మా ఆయనది లూజ్ అవుతుంది మా బాబుది పట్టదు ఇది కరెక్ట్ గా సరిపోయింది అని అంది. అంతేకాదు ఊర్లో ఉన్నప్పుడు పనికి రోజు వేసుకుని పోయేదాన్ని అంది. అవునా.. ఇంతకీ ఊర్లో ఏం పని చేసే దానివి  అన్నాను.

పొద్దుగాల లేసి ఉక్సల్లి పత్తెర పోతుండే ..అప్పుడు అందరం ఇట్లనే వేసుకునే వాళ్ళం అన్నది. 

బీప్ బీప్.. డీకోడ్ చేయడానికి రెండు కొత్త పదాలు అలివేలు నోట. 

ఏం పోతుండే?... -నేను 
పత్తెర పోతుండే!..- అలివేలు 
పత్తెర నా అదేంటి? .. -నేను

ఈ అలివేలు భాషని డెసిఫర్ & డీకోడ్ చేయాలంటే కొత్త భాష నేర్చుకోవాలి.

అదే అమ్మ పత్తి చేన్లకు పోయి అవి తెంపి రావాలి .. -అలివేలు
ఓహో పత్తి ఏర పోతుండేనా!!... -నేను

మరి ఉక్సల్లి ఏంటి?   ‌-నేను
తల పట్టుకున్న.      ‌‌-అలివేలు 
అయినా నాకు తెలియదు.. -నేను 
వాకిలి ఉకమా అదే...- అలివేలు 
ఓహో!..మరి సల్లి... -నేను 
పెండ నీళ్లు చల్లమా.. -అలివేలు 

బీప్..బీప్.. డీకోడ్ కంప్లీట్.!!

మరుసటి రోజు ఉదయం ఒక చేతిలో సంచి మరో చేతిలో  షర్టు పట్టుకుని ఠీవిగా మెట్లెక్కి వచ్చింది.రాగానే ప్రొఫెషనల్ హౌస్ కీపింగ్ ఏజెన్సీ స్టాఫ్ లాగా ఆ షర్ట్ వేసుకుని చీపురు పట్టుకుని పనికి ఉపక్రమించింది. 

రెండు రోజుల తర్వాత బెడ్ రూమ్ లోకి వచ్చి.. ఫోన్లో రీల్స్ చూస్తున్న నాతో,  అమ్మా.. నువ్వు ఇచ్చిన ఈ షర్టు వల్ల నాకు నాలుగు ఉపయోగాలు తెలుసా అంది. మా ఇంట్లో పనిచేసి చేసి.. అలివేలుకు కూడా మేనేజ్మెంట్ లక్షణాలు అబ్బాయి. అన్నిటికీ నంబరింగ్ తో జస్టిఫికేషన్ ఇస్తుంది.

అవునా ఏంటది అన్నా..

ఒక్కటేమో ఇంట్లో పని చేస్తుంటే దుమ్ము మీద పడదు .

రెండోది,ఎండాకాలం కదా అమ్మ వచ్చేటప్పుడు పోయేటప్పుడు షర్టు నెత్తి మీద కప్పుకుంటున్న ఎండగొడతలేదు.. సో..గొడుగు అన్నమాట!

మూడోది ఇంట్లో పని కదమ్మా.. ఊకేటప్పుడు.. తుడిచేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు చీర దోపి పెడుతం, వంగి పని చేస్తం, ఒళ్ళు భద్రంగా ఉంటుంది కదా, ఇది అసలైన కారణం !!

ఫోన్ పెట్టుకోవడానికి అడిగింది ఉత్తదే!!. అట్ల చెప్తే ఏమనుకుంటారో అని చెప్పలేదు. అన్ని ఇండ్లలో వాళ్లు ఒకలాగా ఉండరు కదా అని అన్నది.
"ఏమో అనుకున్న కానీ అలివేలు అలివేలే".. అనుకున్నా సాలోచనగా..

అలా మొదలైన అలివేలు షర్టు ప్రస్థానం కొనసాగుతోంది

Comments