కొట్నం బులా దంచరే కోరిక లోసగేటి గోపాలుని ఎదుట !!కొట్నంబుల!!
1. సురలు మునులు చుట్టాలు గుమిగూడి ||2||
కరుణ గోరుచు పాడగా మనసుదీరా ||2||. !!కొట్నంబుల!!
2. కాంతలు సురభిలు గైకొని విసరాగా ||2||
ఎంతో సంతోషమున కాంతి జనకుడు ఉండగా !!కొట్నంబుల!!
3. పరమా పావనుడైన బాలగోపాలుడు ||2||
వర రుక్మిణి తొడ సరసమాడుచు ఉండగా ||2||. !!కొట్నంబుల!!
4. ధరను తిరుమల సూరి తలచగా వరమేడు
నరహరి పెండ్లిపుడు అరమర లేలని ||2||. !!కొట్నంబుల!!
____________________________________________________
సువ్వి సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెద రోలాల || || సువ్వి||
1. వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోలాల||
కనుచూపులనెడుకండ్లను కన్నెలు దంచెద రోలాల||| || సువ్వి||
2. బంగరు చెరుగుల పట్టు పుట్టములు కొంగులు దూలగా నోలాల|
అంగనులందరు నతి వేడుకతో సంగడి దంచెద రోలాల || || సువ్వి||
3. కురులు దూలగా మంచి గుబ్బఛనులపై సరులు దూలాడగా నోలాల
అరవిది బాగుల నతివలు ముద్దులు గురియుచు దంచెద రోలాల|| || సువ్వి||
4. ఘల్లు ఘల్లు మను కంకణ రవముల పల్లవ పానుల నోలాల
అల్లన నడుములు అసియాడుచు సతు లొల్లనే రోలాల || సువ్వి||
5. కప్పుర గందులు కమ్మని పువ్వుల చప్పరములలో రోలాల
తిప్పలుగా రతి దేలుచుకునే టప్పని బాడేదా రోలాల || సువ్వి||
_________________________________________________
రోలెత్తలేను రోకలెత్త లేను ఓయమ్మో
చామంతి క డియాల చేతులెత్తలేను ఓయమ్మో ||ఆహు||
1.చెలులందరూ గూడి చక చక రారమ్మ
చందనాల పసుపు చేరి దంచంగా
ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ||ఆహు||
2.రమణులంతా వచ్చి రంగవల్లులు దిద్ది
రోళ్ళను పూజించి వేల్పులను వేడి ||ఆహు||
3. ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి
అబ్బాయి పెళ్ళికి ఆహ్వాన మిదె మీకు
మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వాన మిదె మీకు ||ఆహు||
4. పసిడి మనసులతో పసుపును సృజించి
దివ్యవాక్కులతో దీవించు పోరండి ||ఆహు||
5. పసుపు కుంకుమతో పండు ముత్తయిదువలు
శుభమని పలుకుచు సుందరాంగులంతా ||ఆహు ||
6. పసుపును దంచేరు పడతులంతా గూడి
పచ్చంగా నూరేళ్లు పరిఢ లిల్లాలని ||ఆహు ||
7. దంచి దంచి వదినెలు అలసిపోయారు ఓయమ్మ
ఫలహారాలు పెట్టి పైకి లేపండి. ||ఆహు ||
8. చెరిగి చెరిగి చెల్లులు అలసిపోయారు ఓయమ్మా
చెరుకు రసాలతో సేద తీర్చండి. ||ఆహు ||
____________________________________________
కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్లు పెట్టి
ఐదు దోసెళ్ళ కొమ్ములెయ్యరారమ్మ
సీతమ్మ పెళ్లి పసుపులు దంచరారమ్మ
మన రామయ్య పెళ్లి పసుపులు దంచరారమ్మ
1.. పరుగు పరుగున వచ్చి పసిడి రోకండ్లకిప్పుడు
మామిడాకు కంకణాలు కట్టరారమ్మ
సీతమ్మ పెళ్లి పసుపులు దంచరారమ్మ
మన రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ ||కుందనాల||
2. గల్లు గల్లు గల్లు మని గాజులు మ్రోగంగా
పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మ
సీతమ్మ పెళ్లి పసుపులు దంచరారమ్మ
మన రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ ||కుందనాల||
3.. పాలకొమ్మలు నవ్వంగా సన్నాయి మ్రోగంగా
పచ్చి పసుపు కొమ్ములు వేయరారమ్మ
సీతమ్మ పెళ్లి పసుపులు దంచరారమ్మ
మన రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ ||కుందనాల||
4. పెళ్లి దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలియంగా
పెద్ద పసుపు కొమ్ములు వెయ్యరారమ్మ
సీతమ్మ పెళ్లి పసుపులు దంచరారమ్మ
మన రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ ||కుందనాల||
_____________________________________________
సువ్వి కస్తూరి రంగ సువ్వికావేటి రంగ
సువ్వి బంగారు రంగ సువిలాలి
పచ్చని పందిరి వేసి పంచవన్నెల ముగ్గులు పెట్టి
పేరంటాళ్ళు అంతా కలిసి పసుపు దంచితే ||సువ్వి కస్తూరి||
మేనమామ వచ్చినాడు పట్టు చీర తెచ్చినాడు
కుచ్చుపోసి కట్టరమ్మ మోహనాంగికి ||సువ్వి కస్తూరి||
మేనమామ వచ్చినాడు పట్టు పంచ తెచ్చినాడు
మనసారా దీవెనలు ఇచ్చి రామచంద్రునికి ||సువ్వి కస్తూరి||
కంకణములు చేతికి కట్టి ప్రేమాక్షతలు ఇచ్చి
ముదితలంతా కలిసి వచ్చి దీవెనలు ఇవ్వరే ||సువ్వి కస్తూరి||
Comments
Post a Comment