దుశ్శాలువా


(ఈ అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతం. ఎవర్ని ఉద్దేశించినవి కాదు.)

నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో  కలవటానికి వచ్చిన ఉద్యోగులు సెక్షన్ల వారీగా పూల గుచ్చాలు తో వచ్చేవారు.   కొంతమంది మాత్రమే శాలువా తో  సత్కరించేవారు.

ఊరు మారి కొత్త ఊరికి కమిషనర్ హోదా లో వచ్చినప్పుడు ఒక పది శాలువాలతో స్వాగతం పలికారు.

ఇక అప్పటినుంచి అడపా దడపా శాలువాలే శాలువాలు. తిరిగి అక్కడ్నుంచి మళ్ళీ వచ్చినప్పుడు సెక్షన్ల వారిగా, రిపోర్టర్లు, అక్కడ నాయకులు  మరో  ఇరవై శాలువాలు అవన్నీ ప్రభుత్వాసుపత్రిలో ఆ రోజే ఇచ్చేసి వచ్చేసా.

అవసరాన్ని బట్టి శాలువా స్వరూపం మారిపోయింది. ముందు చలి నుంచి తప్పించుకునేందుకు వాడేవాళ్ళు. ఇప్పుడు ఈ సత్కారాలు కోసం వాడే శాలువాలు సిల్క్ దారాలతో జిగేల్ మంటూ అటు చలికి పనికి రావు, ఇటు ఊరికే కప్పుకోవటానికి పనికి రావు (గుచ్చుకుంటాయి) .

అందుకే కొందరు అధికారులు ఈ మధ్య ఈ రకం సత్కారాలు పలకరింపులను ఒప్పుకోవడం లేదు . మాకు కొత్తగా వచ్చిన డైరెక్టర్ పెన్నులు, పెన్సిళ్ళు  పూల మొక్కలు ఇవ్వమని ఒత్తిడి చేశారు. అంతే కాదు మనం ఏదీ తీసుకెళ్ళక పోయినా పేషి లో ఉన్నవే ఇచ్చే వాళ్లు. అవే ఆయన ఆనందం గా తీసుకుని మళ్ళీ పేషి లో ఇచ్చేవారు.

మళ్ళీ ప్రస్తుతం ఒక ఇరవై జిగేల్ శాలువాలు పంపిణీ కి సిద్ధంగా ఉన్నాయి.


భావోద్వేగాలు


మొదట్లో దూరం భారమే ఆయ్యింది.
మదిలో ఎడతెగని గుబులే రేపింది.
ఆలోచనలు ముసిరి అలజడి రేగింది.
జ్ఞాపకాల భావోద్వేగాల వర్షం కురిసింది.

ఎందుకిలా జరిగిందని ప్రశ్న రేకెత్తించింది
కారణం ఏంటా అని కలవర పెట్టింది.
మంచేదో చెడేదో తెలియకుండా పోయింది.
ఏదో చేసేయాలని తహతహలే పుట్టింది.

పోను పోను ఏదో గట్టి నమ్మకమే కలిగింది.
 మనసులో నమ్మకం వమ్ముకాదని  తేలింది.
ఆనందం, విషాదం మన ఎంపికే అని తెలిసింది.
ఇప్పుడిక మనసంతా నిశ్చలం గా మారింది.


Thappad(Review) -it's thappad to all

I feel it's thappad to the amma's who raise their sons insensitively towards women,
it's thappad to amma's again who always ask their daughter to compromise, sacrifice for the sake of social pressures.

it's thappad to normal Indian wives  ( perhaps other country's too)  who never ask or set expectations for their self respect,dignity...or get pleasures out in making family comforts by sacrifying everything.

Yes it's thappad to all men (nannas and husbands)  who by default think that wife and daughter role is to please their family irrespective of their education, achievements.. capabilities.

(As per current societal norms above all are small things before the achievement of giving water or coffee to the home returned husband ). Often they are ignorant about what all was sacrificed by wife also.

Ultimate dialogue is 'kabhi kabhi sahi karna ka decision happy nahi hota"

ఏమైతే నాకేంటి


బాల్యం ఒత్తిడి  కి లోనై చెక్కిలి చిరునవ్వునే
హరిస్తు ఉంటే , బ్రతుకు పరుగు పందెంలో బలవ్వాల్సిందే,
తర్వాత  ఏమైతే  నాకేంటి !!

దారిలో  వెళ్తుంటే సాటి వ్యక్తికి ప్రమాదమై
గిల గిల కొట్టుకుంటుంటే ,నా  పని నాకు ముఖ్యం
తనకేమైతే నాకేంటి  !!

నాటిన పచ్చని చెట్టు నీళ్ళకై అలమటించి
నిర్జీవమై వేళ్ళాడి  చనిపోతుంటే, నా దారి నాదే
తరువు మరణిస్తే నాకేంటి  !!

ప్రపంచం  అంతా కాలుష్యం కోరల్లో  చిక్కుకొని
మన ఉనికినే ప్రశ్నిస్తూఉంటే, అయినా ప్లాస్టిక్ వాడతాం
ఏదేమైతే నాకేంటి !!

జీవన చదరంగంలో గెలిచే యత్నంలో
వంచన చేస్తూ వంచిపబడుతూ ఉంటాం, అయితే
నాకేంటి !ఆహా నాకేంటి!!

                                  ..... వంగీపురం ప్రశాంతి


భారత ఆలయ శిల్ప కళా వైభవము

నేను ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తి గా దర్శించిన ప్రసిద్ధ స్థలాలు, అక్కడ గమనించిన విషయాలు. ఇవన్నీ నా పరిమిత జ్ఞానం తో రాసినవి.  సూచనలకు స్వాగతం. తప్పులుంటే  మన్నించండి.

మొత్తం మీద శిల్పకళ మూడు రకాలు  నగర (ఉత్తర భారతం ) ద్రవిడ (దక్షిణ భారతం) , వేసర (మిశ్రమ రకం). ఇది ముఖ్యంగా గోపుర నిర్మాణం , మండపాలు, గర్భగుడి , ఆలయం వేదిక లలో భేదాలుంటాయి.  ఆ పై  రాజ్యాలు , వాటిని పాలించే మహారాజుల కళాపోషణ, శిల్పుల నైపుణ్యం బట్టి కొద్ది తేడాలుంటాయి.

నేను గమనించిన దాన్ని బట్టి  ఈ ఈ ప్రదేశాలల్లో కనిపించే  శిల్పాలు ఇలా ఉంటాయి .

1.పురాణాలు/ఇతిహాసాలు/ దేవతా మూర్తులు : రామాయణ, భాగవత, మహాభారతాల మిగిలిన ఇతిహాసాల కథలు, దేవతల విగ్రహాలు ముఖ్యంగా కనిపిస్తాయి. ఇవి చాల అందంగా మనకు వెంటనే చిన్నప్పుడు విన్న  ఆ కథలు స్పురించేటట్టూ చేస్తాయి.

2. జీవిత విధానం: ఆ ఆ కాలాల్లో వారి జీవన శైలి  కట్టు, బొట్టు మొదలైనవన్ని ఉంటాయి. ఉదాహరణకు కింది అన్ని ప్రదేశాలల్లో కుడా కేశాలంకరణ, వస్త్రాలు,ఆభరణాలు, పాదరక్షలు, మనుషుల ఆకృతులు  మానవుల జంతువులని వివిధ రవాణా వ్యవస్థ కు వినియోగించడం, వివాహాలు, యుద్ధాలలాంటివన్ని    గమనించవచ్చు  ( చాలా వాటిల్లో ఇప్పుడు మనం ఫ్యాషన్  గా పరిగణిస్తున్నవన్ని అప్పుడే వాడుకలో ఉండడం చూస్తాం.)
3. ప్రకృతి - పుష్పాలు,లతలు, రక రకాల ఆకృతులు ఎంతో సునిశితంగా ఒక మిల్లిమీటర్ అంత చిన్నవి కూడా దూరం నుంచి కనిపించేంతగా ఖచ్చితంగా చెక్కబడి ఉంటాయి.( చెక్కలో కూడా అంత సూక్ష్మంగా   చేయాలంటే ఎంతో పట్టుదల నేర్పరితనం ఉండాలి అలాంటిది రాతి పై చెక్కడం నిజంగా అబ్బురమనిపిస్తుంది.)


4. శృంగార మూర్తులు: ఆ కాలం వారు ధర్మార్థ మోక్షాలతో సమానంగా అంత పవిత్రంగా కామాన్ని కూడా పరిగణించారు కాబోలు , రక రకాల శృంగార భంగిమల శిల్పాలు  వాత్సాయన కామ సూత్రాలు  వీక్షకులకు తారసపడతాయి. ఏ కారణం చేతనో మన దేశంలో తర్వాతి కాలంలో మన సంస్కృతిలో కొంత ఇలాంటి వాటికి హద్దులు ఏర్పడ్డాయి. కాని మన పూర్వీకుల కాలంలో అది సర్వ సాధారణమని  వీటిని గమనిస్తే తెలుస్తుంది. కేవలం ఖజోరహూ కే ఆ ముద్ర వేసారు కాని ( అక్కడ ఒక పది శాతం ఎక్కువ ఉంటాయెమో   కాని అన్ని చాల గుడి గోపురాలల్లో మనం గమనించవచ్చు.)

5. ఇతరత్రా : ఇవి కాకుండా తోరణాలు, ఇతర ఆకృతులు , కోణాలు ఇతర కంటికి ఇంపు కలిగించే శిల్పాలు ఆకృతులు ఉంటాయి.

గమనిక: వీటిల్లో  చాలా చారిత్రక కట్టడాలను   విదేశీయులు  దండయాత్రలలో ధ్వంసం చేసారు. కొన్ని భూకంపం లాంటి ప్రకృతి ప్రకోపాలకు గురి అయ్యి ,  చాల కొన్ని మాత్రమే వాటి మూలాలతో పాటు ఉన్నాయి. కొన్నింటిని UNESCO వారు  మరి కొన్నిటిని  ASI  వారు భారత ప్రభుత్వ సహకారంతో పరిరక్షిస్తున్నారు.  అయినప్పటీకి ఉన్నవే అప్పటి కాలాన్ని ప్రతిబింబిస్తూ వారి  వైభవాలను  మనకు చాటుతాయి.


ఖజూరహూ, రామప్ప, హలేబిడు, కోణార్క్,సోమనాథ్, హంపి  ఆలయాలు గురించి చిన్న వివరణలుఖజురహో  :
10 నుంచి 12 వ శతాబ్దం మధ్యలో చందేలా  సామ్రాజ్య మహారాజులు నిర్మించారు ఖజురహో ఆలయ సమూహాలు. యశోవర్మన్  అనే మహరాజు ఆధ్వర్యం లో సిమ్హ  భాగం నిర్మితమయ్యింది.  రెండు శివాలయాలు , రెండు విష్ణు   ఆలయాలు   ఎత్తయిన వేదిక పై  చిన్న నాలుగు ఆలయాలతో కూడి ఉంటాయి.

ఇవి కూడా   సునిశితమైన అచ్చెరువొందిచే శిల్పాలతో ఆకట్టుకుంటుంది. 

ఈ ఆలయాలు శృంగార శిల్పకళకు పేరొందినా  అది 10% మాత్రమే నాకు తెలిసి కోణార్క్ హలెబిడు లాంటి గోపురాలపై కుడా ఇవి ఉంటాయి.(చివరికి హంపి లో కుడా గమనిచా) .
మరో వైపు జైనుల ఆలయ సమూహం కూడా ఉంటుంది.
యునెస్కొ వారి ప్రపంచ వారసత్వ సంపద లో చేర్చబడింది

రామప్ప ఆలయం.

11 శతాబ్దంలో.. దక్షిణ భారతం లో శాతవాహనుల తర్వాత  అంతటి ప్రఖ్యాతి గాంచిన  కాకతీయుల సామ్రాజ్యం లో రేచర్ల రుద్రుని ఆఙ్ఞ పై రామప్ప నిర్మించిన  అద్భుత దేవాలయం...పాత  వరంగల్లు  ప్రస్తుత ములుగు జిల్లా లో ఉన్న రామప్ప ఆలయం.
అద్భుత శిల్ప క ళా సౌరభాలతో...గోపురం లో ఉన్న ఇటుకలు నీళ్లలో  వేస్తే తేలడం ఇక్కడి ప్రత్యేకత
ఆలయం ఒక సుమారు నాల్గు అడుగుల  నక్షత్రా ఆకారం లో ఉన్న ఎత్తైన పీఠం పై కొలువు దీరి ఉంటుంది.
యునెస్కొ వారి ప్రపంచ వారసత్వ సంపద లో ప్రతిపాదించబడింది 

హాలేబీడు: 12 వ శతాబ్దంలో.. హొయసాల రాజ్యం లో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలో అప్పటి ద్వారాసముద్రం ఇప్పటి హాలేబీడు లో విష్ణువర్ధనుడు.. హొయసలేశ్వర..శాంతలేశ్వర అనే జంట ఆలయాలను నిర్మించాడు. ఇవి హొయసాల శిల్ప కళ తో ఉట్టిపడుతుంటాయి.
రామాయణ ,భాగవత, మహాభారత కథలు, అశ్వ,గజ,సింహాల్లాంటి..జంతువులు, లతలు,సుమాలు.. ఆ కాలం నాటి కళలు, జీవన విధానం.. ఈ కుడ్యాల పై చెక్కబడి ఉంటుంది.
చాలా మందికి తెలియక పోయినా కోణార్క్, సోమనాథ్ అంతటి  గొప్ప  అందమయిన ఆలయం..

యునెస్కొ వారి ప్రపంచ వారసత్వ సంపద లో ప్రతిపాదించబడింది 

కోణార్క్:
13 వ శతాబ్దంలో.. అప్పటి కళింగ రాజ్యం ఇప్పటి ఒరిస్సా లో నరసింహ దేవుడు  పూరికి కొంచెం దూరం లో చంద్రభాగ నది తీరంలో  కోణార్క్లో   సూర్య దేవాలయం నిర్మించారు.
సప్తాశ్వాలతో ( ఏడు రోజులు)  ద్వాదశ ( పన్నెండు మాసాలు) జతల చక్రాల తో( ఇరవై నాలుగు గంటలు) కూడిన రథారూడుడై ఉషా, ప్రత్యూష అనే దేవతా మూర్తులు తిమిర సంహారానికి బాణాలు సంధిస్తున్నట్టు..వెలుగు రేఖలు ను ఈ ప్రపంచమంతా ప్రసరింప చేస్తుందేమో.. అన్నట్టున్న భిన్నమయిన భిన్నమయిపోయిన ఆలయం.
యునెస్కొ వారి ప్రపంచ వారసత్వ సంపద లో చేర్చబడింది 

సోమనాథ్ జ్యోతిర్లింగం

1024 నుంచి 1665 వరకు గజనీ మహమ్మద్ నుండి ఔ రంగ జెబు వరకు అజ్ఞానం తోనో అహంకారం తోనో ,అత్యాశతోనో ఒకే ఆలయాన్ని ఎన్నిసార్లు ధ్వంసం చేసినా ప్రతీసారీ మునుపటిమించిన సౌందర్యం శోభలతో భారత చరిత్రలో నిలిచిన( నాకు తెలిసినంత వరకు) ఏకైక  ఆలయం .ఆలయం మొత్తం చాళుక్య శిల్పకళా రీతిలో.. సునిశితంగా గా చెక్కిన భిన్న విభిన్న శిల్పసంపదతో కనువిందు చేస్తుంది. ఎక్కువగా లతలు ,జాలి లాంటిది, పూవుల డిజైన్లు కనిపిస్తాయి.హాయిగొలిపే హంపి 
 14  శతాబ్దంలో సంగమ, సాళువ ,తుళువ  వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని హపి, విజయనగరం ను రాజధాని గా చేసుకొని నిర్మించారు. దానిలో కేవలం గుడులే కాక కోటలు, అంత;పురాలు, గజశాలలు వంటి ఎన్నో చారిత్రక కట్టడాలు  (శిథిలావస్థలో ఉన్నా) కనువిందు చేస్తాయి. డిల్లీ సుల్తాన్ల దాడి లో కూలి పోయినా , మిగిలిపొయిన కట్తడాలు  ఏ రాయి ,ఏ శిల్పం ఏచెట్టూ ,గుట్ట చూసినా మనల్ని ఆ కాలం నాటి రచరికం, ఠీవి , ప్రతిభ పలకరిస్తుంది.

ఇవి ఉత్తరాది భిన్నంగా  ద్రవిడ సాంప్రదాయంలో  విజయనగర శిల్పకళతో ఎక్కువ భాగం శ్రీ కృష్ణదేవరాయల వారి కాలంలో నిర్మించబడి   ఉంటాయి. యునెస్కొ వారి ప్రపంచ వారసత్వ సంపద లో చేర్చబడిందిరాస్తున్నా..రాసేస్తున్న

రాస్తున్నా..రాసేస్తున్న

జ్ఞాపకాల దొంతరలను
కదిపి కదిపి దులిపి దులిపి
జారిపడిన అనుభవాలను
అనుగుణంగా వేరుచేసి
సంతోషపు మూటలన్ని
తరచి తరచి... నలిపి చూసి
మది అరలలో పైపైన పరిచి

కఠినమైన గుర్తులన్ని
భద్రంగా మడత పెట్టి
అర అడుగున అట్టిపెట్టి
వాటి పాఠాలను రంగరించి
రుచిని కలిపి అందరికి పంచిపెట్టి

మస్తిష్కపు మూలలలో
మాగి ఉన్న చిలిపి గుర్తులన్ని
చల్లచేసి చిలికి చిలికి
తేలిన తెల్లని వెన్న
కరగకుండా దాచిపెట్టి

రాబోయేఅనుభవాలకు
ఆహ్వానం పలికి
తినబోయే రుచులకు
తీయదనం కలిపి

రాయమని.. రాసి పారేయమని
ఇచ్చిన పిలుపుని అందుకొని
ఆలోచించి..ఆత్రపడి
రాయలనుకుంటున్నా
కొత్తగా అబ్బిన
కళలకు న్యాయం చేసేయాలని..
రాయలనుకుంటున్నా

                     .... వంగీపురం ప్రశాంతి

మానవత్వం

పైకం పై మైకం..సుఖం కై బహుముఖం..

తీస్తారు కాలం వెంట పరుగులు...
చాస్తారు  వ్యామోహాల కోసం అర్రులు

చాలనుకోవాలి ఉంటే ఒక నీడ...
ఉందనుకుంటే  తినడానికి నాలుగు మెతుకులు..

చేయాలి మనిషికి మనిషి సాయం...
లేకుంటే మానవత్వానికే గాయం

 ఎందుకు వస్తామో ఏమో ఈ లోకం లోకి
 ఎప్పుడు పోతామో తెలీదు  పై లోకానికి

ఉంటుంది పుట్టుక కొక కారణం....
ఉండాలి మరణం తరువాత జీవితం..

గెలుపు ఓటమి

నీవొక నిండు కుండ....
నేనొక  మాటల మూట.....

నీవొక గంభీర అర్ణవం ...
నేనొక గలా గలా పారే సెలయేరు...

నీవొక  మత్తెకించే పరిమళం....
నేనొక నిండు జాబిలి వెన్నెల....

నీవొక పిల్లగాలి పాట
నేనొక  భావావేశపు తోట   

నీపై నాకొక ఆశ ...
నాపై నీకొక ఆశ...

ఇదొక గెలుపు ఓటముల  ఆట.....

నిజం...నిప్పు

ముల్లై గుచ్చు కోకు.....గాయం చేయకు
ప్రేమైవిచ్చు కోకు......మైకం కాకు
వెన్నెలలా వలపు జల్లకు....వ్యసనం కాకు
అయస్కాంత లా ఆకర్షించకు.....వీడిపోకు
మదినే మాయ చేయకు......ఓటమి కాకు
అతిగా ఆశపడకు......భంగపాటు కాకు
అనురాగ వర్షం కురిపించకు.....ఆవేదన కాకు
నేనే నీవు కాకు.....చివరకు వంచించకు


జీవిత నావ

ఆనందంగా సాగిపోతున్న జీవితమనే ఒక నావ
అందులోకి ఎక్కే వారు.... గమ్యం రాగానే దిగేవారు
కొందరు మిగిలి పోతారు...చక్కని మిత్రులుగా
కొందరిని మరిచిపోతాము.... యాదృచ్చికంగా
కొందరు  పయనిస్తారు  మనతో కడదాకా...
ఆజన్మ ఋణాను బంధగా...


అలా నావలోకి ప్రవేశించి....
మొదట యాదృచ్చికమై...
క్రమేణా హితమై...స్నేహితమై..
తరవాత బంధమయి... మరి అనుబంధమై...
అమాయకంగా...ఆదరంగా..
అభిమానంగా, ఆరాధన  కురిపిస్తే...

ఆ అనురాగ ప్రపంచం లోని ఊహల పల్లకి లో
రాణినై...మహారాణినై
అభిమానం వర్షంలో తడిసి ముద్దై...

అర్థం కాక,  ఆలోచనల కు అందక
ఉక్కిరిబిక్కిరై....
అది కలయా ,భ్రమయా తెలియని
ఒక వింత అనుభూతి కి బానిసనై....

మొదట అలవాటై
ఆపై కమ్మని ఎదురుచూపై
చివరకు వ్యసనమై....
నమ్మాలో  వద్దో... కావాలో వద్దో
తగునో తగదో... అనే అంతులేని
ఆత్మక్షోభ కు లోనై....

ఒప్పుకోలేక....వదులుకోలేక
దాచుకోలేక....చెప్పుకోలేక
మరిచిపోలేక, మరుపు రాక
అందుకోలేక...బయటపడలేక

మిగిలిపోయాను...సునామీ లో చిక్కిన నావలో...
లేని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ
నిబ్బరంకై ప్రయత్నిస్తూ....
ఆత్మస్థైర్యాన్నికూడ గట్టుకుంటూ...
ఆనందాన్ని నటిస్తూ...
గమ్యాన్ని అంచనా వేస్తూ...

దుశ్శాలువా

(ఈ అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతం. ఎవర్ని ఉద్దేశించినవి కాదు.) నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో  కలవటానికి వచ్చిన ఉద్యోగులు సెక్షన్ల ...