నిత్య కళ్యాణ స్వామి –శ్రీ లక్షీ వరాహ స్వామి (తిరువిడంథై, చెన్నై)



శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పరమ పవిత్రమయిన 108 విష్ణు దివ్య దేశాలలో 62 వది తమిళనాడు లోని
తిరువిడంథై. కోమలవల్లి సమేతుడయిన  “ శ్రీ లక్షీ వరాహ స్వామి ఈ పుణ్య క్షేత్రం లో దర్శనమిస్తారు. భగవత్భక్తులయిన 12 గురు ఆళ్వార్లు వివిధ ప్రాంతాలలోని వెలసిన శ్రీ విష్ణుమూర్తి ని ప్రబంధాల (మంగళా శాసనం) రూపంలో రచించి ప్రస్తుతించారు. ఆ ప్రదేశాలు విష్ణు దివ్య దేశాలు గా పేరుపొందాయి.ఇవి ఎక్కువ గా తమిళనాడు లో కొన్ని కేరళ, ఆంధ్రలలో అతి కొన్ని ఉత్తర భారత దేశం లో ఉన్నాయి. 
    
ఈ క్షేత్రం చెన్నై కు 40 కి మి దూరం లో మహాబలిపురం కు అతి చేరువలో బంగాళాఖాతానికి తీరాన  పచ్చని  చెట్లు మరియు  సెలయేళ్ళ మధ్య లో ప్రకృతి మాత ఒడి లో చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

సన్నిధులు
మూల విగ్రహం  --    శ్రీ లక్షీ వరాహ స్వామి తన ఎడమ తొడ పై కోమలవల్లి అమ్మవారిని ప్రతిష్టించుకొని ఉంటారు.
ఉత్సవ విగ్రహం --    శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్
ఆండాళ్          --    కోమల వల్లి, అఖిలవల్లి అమ్మవార్ల సన్నిధులు
                       రంగనాథన్, రంగనాయకి సన్నిధి
తిరుమంగై ఆళ్వార్ రచించిన 13 పాశురాలే ఇక్కడి మంగళాశాసనం.మనవాల మామునిగళ్ కూడా ఈ  స్వామిని సేవించారు.
స్థల పురాణం:
పూర్వం కృత యుగంలో మేఘనాథుడనే ఒక రాజు కు బలి అనే కుమారుడుండేవాడు. అతను రాక్షసుల కోరిక మేరకు వారికి దేవతలతో తలపడేందుకు సహకరించాడు. తర్వాత కాలంలో ఆ అపరాధభావన అతన్నివెంటాడగా క్షమాభిక్షకై విష్ణుమూర్తి అనుగ్రహం కోరుతూ ఘోర తపమాచరించాడు. ఆతని భక్తికి మెచ్చి ఆ మహా విష్ణువు వరాహ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించాడని ప్రతీతి.  అందుకే దీనికి ఈ స్థలానికి వరాహ పురి అనే పేరు  కూడా ఉంది. ఇక్కడి  తీర్థం పేరు  కూడా వరాహ తీర్థం అంటారు.
స్థలమహత్యం:
సరస్వతీ నదీ తీరం లో కుని అనే మహర్షి ఆశ్రమం ఉండేది. ఆ ఋషి కి అతని శిష్యులకు ఆయన కుమార్తె ఉపచారాలు చేస్తూ ఉండేది. వొకనాడు ఆమె తాను కూడా మోక్షం పొందడానికై తపమాచరించగా అవివాహితులు మోక్షానికి అర్హులు కారని తెల్సుకొంది. వెంటనే ఆశ్రమం లోని శిష్యులలో ఎవరినయినా తనను వివాహమాడవల్సిందిగా కోరింది. వారిలోని కవల అనే మహర్షి ఆమెను వివాహమాడాడు.వారికి సంవత్సర కాలంలో 360 మంది కుమార్తె లు కలిగారు. అప్పుడు కవల ముని వారి వివాహోపచారాలకై  చింతింస్తుండగా అతనికి శ్రీ లక్షీ వరాహ స్వామిని సేవించుకొమ్మని ,అతని కోరికలు తీరుతాయని తెలుసు కొని ఆయన భక్తితో వరాహపురి లోని స్వామిని పూజించసాగాడు. అప్పుడు స్వామి బ్రహ్మచారి రూపంలో ప్రత్యక్షమై కవల ముని 360 మంది కుమార్తెలను నిత్యం వొకరిని చొప్పున పెళ్ళాడాడు. అందుకే ఈ స్వామి ని నిత్య కళ్యాణ పెరుమాళ్ గా ప్రసిద్ధి గాంచారు. మూల విగ్రహం తొడ పై ఉన్న అమ్మవారు ఆ 360 కన్యలకు ప్రతిరూపంగా వారిలో ప్రథమురాలైన కోమలవల్లి నాంచారు, శ్రీ రూపంలో ఉంటుంది. అందుకే దీనికి  శ్రీపురి అనే పేరు వచ్చింది. (అదే తమిళంలో తిరు + వడి + ఇంథై). వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారు ఇక్కడి నిత్య కళ్యాణ స్వామి సేవించుకొని ప్రార్థిస్తే తక్షణమే వివాహం జరుగుతుందని నమ్మకం. ఎంతో ప్రశాంతమయిన వాతావరణం లో వెలసి మనస్సులోని క్లేశాలన్నంటిని తృటిలో తొలగించేలా పవిత్రంగా అలరారే ఈ శ్రీ వైష్ణవ దివ్య దేశం అందరూ తప్పక సందర్శించాల్సిన  పుణ్య క్షేత్రం.


















Comments