మరీచిక





   







ఏదైనా పిలుపు వినిపించిందా ??   
వినిపించదనీ తెలుసు.
చల్లని పిల్లగాలి తెమ్మెర లాంటి నిన్ను 
మహి నైన నాలో బంధించడం 
కుదరదని తెలుసు.

అది కేవలం  ఈ భూపొరల మధ్య  
అలా అలలా కలలా వస్తూ వీస్తూ
హాయిగాసృశిస్తూ సేదతీరుస్తూ తిరిగివెళ్ళిపోతుంది.

అయినా నా పిచ్చి కాని ఎగిసి పడే కెరటం 
తీరాన్ని హత్తుకొని అలాగే వుండిపోతుందా!!
రకరకాల భావొద్వేగాలను మోసుకొస్తూ తీసుకెళ్తూ 
ఇలా తాకి అలా వెళ్ళిపోతుంది.

ఈ కఠోర నిజాలన్నీ నాకర్థం కావేం ?
 అయినా మనసు అంగీకరించదేం?
రాయిలా మార్చుకుందాం అనుకున్న 
మనసు నీ రూపం మెదిలినా, 
తలపు కలిగినా  రాగంలా మారిపొతుందేం?  

చిత్రకూట నరసింహ స్వామి ఆలయం 
మండపం లో ఏ శబ్దం చేసిన సప్త స్వరాలు 
పలికినట్టు నీ ధ్యాసలో ధ్యానంతో ఒళ్ళంతా 
పులకరించి మైమరచి   తుళ్ళిపడుతుందేం??



నీతో మాట్లాడని రోజు నేను కాంతి లేని దీపం లా...       
శాంతి లేని రూపం లా...వాసన లేని పుష్పం లా..         
ఆగిపోయిన కాలం లా...వెలుతురే రాని వేకువలా..       
విషాద గీతికలా..... మిగిలిపోతాను !!
ఎందుకీ అలజడీ.. ఎందుకీ అశాంతి ?


అంతులేని అర్థం కాని ఈ అంతర్మథనం నుండి బయట పడేదెలా?
దుష్యంతుడు శకుంతలను మరిచినట్టుగా మరపు రాదేలా ?
నా హృదయం లోని తడి ,ఆలోచనలోని ఆర్తి నాలోనే ఆవిరవదేలా?
కల చెదరకూడదని కఠినమైన నిజం దరికి రాకూడదని
వెన్నెలకై ఎదురుచూసే తామరలా...
చంద్రునికై వేచిచూసే చకోరపక్షిలా నిరీక్షిస్తూ వుంటా.......!!




(Picture courtesy :google images)


Comments

  1. Chaalaa chaalaa bagundi:):)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదలు ఎగిసే అలలు గారు నా రాబోయే రచనలకు ఈ కామెంట్ ఊపిరి లాంటిది

      Delete
  2. కామెంట్ చెయ్యటానికి బాగుందనో లేదు ఒక సలహానో లేక అభిప్రాయం చెప్పేసి ఊరుకొవచ్చు. అతిశయం అలాగే కఠోర భావన రెండు పరస్పర విరుద్ధమైన భావాల స్వీకరణ స్తితి ఉన్నదా లేదా అన్న విషయాన్ని అనుసరించి చెప్పవలసి ఉంటుంది.

    కాదేది భావ ప్రకటనకు అనర్హం, యోగ్యం, అది ఎప్పుడు అంటే అంతర్ద్రుష్టిలో సృజన దేవత ఆనంద నర్తనం చేస్తున్నప్పుడు కదా.

    నదిలో పాయలు వేరుపడ్డట్టుగా కనపడతాయి భౌతికంగా, కాని ఒక్కో దిక్కు వైపు ప్రవహిస్తూ ఒక చోట సంగమించి, ఆ ప్రవాహం సముద్రములో కలుస్తుంది, ప్రతి ఒక్కరి ప్రయత్నం అందుకే, ఒకరో ఇద్దరో మటుకు మెలుకువలో ఉండి ఈశ్వరుడిని చేరుతారు.

    అలాగే ఈ పాయలు స్త్రీ యొక్క కేశములలో గంగ, యమునా, సరస్వతి స్తితులుగా చెప్పబడి, పైకి మటుకు గంగ యమునలుగా కనిపిస్తూ అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తుంది.

    మీ భావ ప్రకటన అత్యున్నతమైన ప్రకాశానికి చేరువలో, ఆ ప్రకాశపు కాంతి పుంజమును స్వీకరిస్తున్న చిగురించిన చక్కటి మొక్క వంటిది.

    నావంటి సామాన్యుడు సైతం గ్రహించటానికి మంచి మంచి విషయాలు, మరెన్నో అంశాలు అంతర్ద్రుష్టితో చూస్తె తప్పించి తెలియనంత గహనముగా ఉన్నవి.

    ధన్యవాదములు :-)

    ReplyDelete
    Replies
    1. ఇది కామెంట్ లా లేదు కావ్యం లా వుంది!!

      భావ ప్రకటన బాగున్నందుకు చాలా థాంక్స్. keep commenting kartik !!

      Delete
  3. This is deadly awesome 🙌👌👌👌

    ReplyDelete

Post a Comment