97- 67 నా బరువు ప్రస్థానం- మొదటి భాగం

ఎవరు పుట్టార్రా?   అమ్మాయా?.....  అబ్బాయా?   అని  ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన నాన్నని  నానమ్మ ఆత్రంగా అడిగితే  అమ్మాయే పుట్టింది అమ్మా!!   అమ్మాయి అయితే ఏముంది కాని... బాగా బొద్దు గా ,ఎర్ర....గా, బూరె బుగ్గలతో వాచినట్టున్న పెదాలతో అచ్చం ఆంజనేయస్వామి లా ఉందమ్మా... అని అప్పుడే పుట్టిన నా గురించి వాపోయాట్ట నాన్న.  అలా  పుట్టినప్పట్నించే  నేను బాగా బొద్దు.  చిన్నప్పుడు పెద్ద తెల్సేది కాని కాలేజీ కి వచ్చేప్పటికి అనిపించేది నేను సన్నగా నాజూగ్గా ఉంటే బాగుండేదని... అన్ని రకాల దుస్తులు వేసుకోగల్గేదాన్నని  కొంచెం బాధ పడేదాన్ని.

కాని ఇంట్లో వాళ్లు మాత్రం ఆ..... ఏమంత లావు.... కాస్తా పుష్టిగా ఉన్నావంతే.... దాని గురించి ఇప్పుడు డైట్ లు అవీ అంటూ కడుపు మాడ్చుకోకు. ఈ వయసు లో తిన్నదే ఒంటికి పట్టేది ... మా వయసు వస్తే ఎలాగూ తిన్లేరు అయినా ముందు చదువు పై శ్రద్ధ పెట్టు ఈ పిచ్చి పిచ్చి విషయాలపై కాదు అంటూ హెచ్చరికలు.    
బాగా తెల్సిన బంధువుల అబ్బాయి తో చిన్న వయసులో పెళ్ళవడంతో లావు 
అడ్డంకి కాలేదు.పెద్దబ్బాయి పుట్టినప్పుడు ఆరోగ్య సమస్యలతో చాలా సన్నబడ్డాను. కాని  కష్టపడకుండా తగ్గాను కాబట్టి కొద్ది నెలల్లోనే రెట్టింపు బరువు పెరిగాను. తర్వాత రెండు మూడు సార్లు జిమ్ లో చేరి ఏడెనిమిది కిలోలు తగ్గినా ఏదో ఒక కారణం చేత మానటం మళ్లీ పెరగడం. కొంచెం రూటు మార్చి ఒక యోగా క్లాసు లో చేరాను. అదీ కొన్నాళ్లే. ఇక పట్టించుకోవడం మానేసాను.

కొన్నేళ్ళ తర్వాత  కాస్తా నడచినా గట్టిగా నవ్వినా ఏ పని చేసినా విపరీతమయిన ఆయాసం వచ్చేది.తిరిగి చూసుకుంటే విపరీతమయిన ఒళ్లు వచ్చేసింది .అది బెలూన్ లా ఉబ్బి ఉబ్బి ఏదో ఒక రోజు ఫట్ మని పేలుతుందేమో అనిపించేది. అందం కాక పోయినా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇక లాభం లేదనుకొని ఒక ఒబేసిటీ క్లినిక్ కు వెళ్లాను. వాళ్లు అన్నీ చూసి నీవు ముప్ఫై కిలోల పైన బరువు ఎక్కువున్నావు. మేము నెల కు ఒక్క సారి 
ట్రీట్ మెంట్ ఇస్తాం. ఒక్క సారి కి ఫీజు వెయ్యి రూపాయలు.(అప్పట్లో ఇంత ఇప్పుడు ఇంకా ఎక్కువ) కాని బరువు తగ్గడం మొత్తం మీ మీదే ఉంటుంది.
రోజుకి గంట తగ్గకుండా బ్రిస్క్ వాక్ చేయాలి.మా ఆహార నిపుణులు ఇచ్చే నియమాలన్నీ పాటించాలి. మీరు ఏనెలయి నా తగ్గకపోతే అది మాకు సంబంధం లేదు అన్నారు. అన్నీ మనం చేసి మరి డబ్బులు వాళ్లకెందుకు ఇవ్వాలో అర్థం కాలేదు. 
ఇలా కాదని ఒక ప్రఖ్యాత ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్లా. ఆయన అధిక బరువు కు చికిత్స మొదలు పెట్టాడు. ఆ మందులు వేసుకుంటే అసలు ఆకలి వేసేది కాదు. కాని మనకేమో రోజు కి రెండు లేదా మూడు సార్లు తినే అలవాటు. వారం అయినా ఆకలి లేదు. నీర్సం  వచ్చింది. కథ మళ్లీ మొదటికి.
మెల్లగా గాస్ట్రిక్ సమస్య, హార్మోన్ల సమస్యలు మొదలయ్యాయి.


జిమ్, నడక, యోగా , సరైన ఆహార అలవాట్లు, ఏరోబిక్స్ ఏం చేెయాలి?? ....
ఎలా మొదలు పెట్టాలి ....  ???

సరిగ్గా అప్పుడే అమెరికానుంచి వచ్చిన మా అన్నయ్య "నేను ఇదే సమస్య తో సతమతమవుతున్నాను. తిరిగి వెళ్లంగానే మంచి నిపుణుల సలహాతో తగ్గాలనుకుంటున్నాను" అన్నాడు.  రెండు నెల్లతర్వాత ఫోటోలలో, వీడియో చాట్ లో చూద్దును కదా ఆశ్చర్యం బాగా తేడా తెలుస్తోంది.   ఏ మందులు వాడలేదు,  ప్రత్యేకమయిన చికిత్సా తీసుకోలేదు. వెంటనే నేను  వివరాలన్నీ తెల్సుకొని సీరియస్ గా అధిక బరువు తగ్గే కార్యక్రమం మొదలెట్టాను.


                                               ఎలా...... ఏమిటీ......... తరువాయి భాగంలో  

(నేను ,అన్నయ్య అలా చెరి ముప్ఫై కిలోలు ఆరోగ్యంగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకుండా(నేనయితే చిల్లి గవ్వ ఖర్చు చేయకుండా), విజయవంతంగా తగ్గటమే కాకుండా గత ఐదేళ్ళుగా అలానే మెయిన్ టెయిన్ చేస్తున్నాం)


  4 comments:

 1. waiting for second part eagerly... plz continue...

  daily im checking ur website for second part.............

  ReplyDelete
 2. waiting for second part ...

  ReplyDelete
 3. రెండేళ్ళు అయింది రెండవ పోస్టు ఎప్పుడు వ్రాస్తారు ?

  ReplyDelete
  Replies
  1. మేడం ...నేను వెంటనే అది రాయటం మొదలుపెట్టాను, కాని పని వత్తిడి లో పూర్తి చేయలేక పోయాను.. కాని కొన్ని నెలల (January 17) క్రితమే రెండో భాగం పోస్టు చేసాను చూడండి.
   http://rohinimadi.blogspot.in/2015/01/97-67.html

   Delete

దుశ్శాలువా

(ఈ అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతం. ఎవర్ని ఉద్దేశించినవి కాదు.) నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో  కలవటానికి వచ్చిన ఉద్యోగులు సెక్షన్ల ...