ఈ మధ్య ఒక స్నేహితురాలి ఇంటికి పూనే వెళ్ళాల్సివచ్చింది. ఆ రోజు ఉదయం లేచేసరికి what's app లో అందరూ కృష్ణుడిని అలంకరించి పూజలు చేసి రకరకాల నైవేద్యాలు పెట్టిన ఫొటోలు పంపించారు . అది చూసి ఏంటి ఈరోజు అని కాస్తా ఆలోచిస్తే 'కృష్ణాష్టమి' అని గుర్తుకు వచ్చింది.
చిన్నప్పుడు ఈ పండగ సందడే వేరేగా వుండేది. అమ్మ మధ్యాహ్నం దాక ఆగి (ఉద్యోగస్తురాలు అయినా కూడా) మడిగాచకిలాలు,మురుకులు ,దిబ్బణాలు,కర్జకాయలు,మైసూర్ పాక్ , రవ్వలడ్డు, మా ఆవుల పాల నుంచి తయారు చేసిన కోవా, పులిహోర ,దద్దోజనం , చక్కెర పొంగలి, క్షీరాన్నం ఇలాంటి వండిన వంటలే కాక , చిక్కటి పాలు, పెరుగు ,వెన్న, మీగడ, నెయ్యి .. మిరియాల పొడి,శొంఠి పొడీ,జీలకర్ర పొడి (యశోద పచ్చి బాలెంతరాలు కాబటి ఇవన్ని తల్లికి.) వగైరాలు ఎన్నో వంటలు దాదాపు తక్కువలో తక్కువ పదహారు రకాలు చేసి రాత్రికి చక్కగా ఎంతో భక్తి తో చిన్ని కృష్ణయ్యకు పూజలు చేసి, దూడతో కూడిన గోమాత ను కూడా పూజించి రాత్రికి మేము ఉపాహారాలు చేసే వాళ్ళం.( ఇన్ని తిన్నాకా ఇంకా ఉపాహారాం ఏంటీ అనుకుంటున్నారా భోజనం చేయట్లే కదా అందుకే).ఇదో చక్కని గుర్తు మాకు. సరేఇప్పుడు ఈ బాధ్యత మా పై పడింది.మొదట్లో ఇంత కాకపైనా ఇంతో కొంతా చేసేదాన్ని. క్రమేణా ఉద్యోగాలు ,ఇతర పనులు మీద పడటం తో ( ఇవన్ని సాకులు మాత్రమే శ్రద్ధ లేక అని ఇప్పుడు తెల్సుకున్నాను) కొంచెం కొంచెం తగ్గుతూ మొత్తమే మానేసాం.
ఇంతలో నా ఫ్రెండ్ ఒక వ్యంగ్యమైన నవ్వు నవ్వి ఇవన్నీ ఇప్పుడు కొంత మంది చేస్తున్నారు కాని నీకు తెల్సా ఈ మధ్య నే ఒక న్యూస్ చదివాను మన పిల్లల జెనరేషన్ తర్వాత ఈ మతాలు ,పండగలు ఇవన్ని ఎవరికి తెలియవట. ఒకటే మతం మిగులుతుంది మానవ మతం (ఇది మంచిదే కాని ఇతరులకు ఇబ్బంది కలిగించనతవరకూ వేడుకలు జరుపుకోవడంలో, నమ్మకాలు కలిగి వుండడంలో తప్పులేదని నా అభిప్రాయం) ఇక సంస్కృతి సంప్రదాయాలు అనే పదాలు అసలు ప్రపంచంలో ఉండనే ఉండవట అని అంది. ( తను ఆస్తికత్వం మరియు నాస్తికత్వం మధ్యలో ఊగిసలాడుతోంది లేండి) .నాకు మాత్రం మనసు చివుక్కు మంది మన పిల్లలకు తెలియకుండా పోవటానికి కారణం ఎవరు మనమే కదా అనిపించింది . నేనూ దీనిలో నా పాత్రను పోషిస్తున్నాను అని కనువిప్పు కలిగింది. అంతే అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకున్నా ఇక నుంచి ప్రతి పండగను చక్కగా జరుపుకోవాలని తెల్సిన ప్రతి విషయాన్ని పిల్లలకి చెప్పాలని. ఎదో ఒక కుంటి సాకు తో మన సాంప్రదాయాలకు మంగళం పాడకూడదని.... వెంటనే దసరా పండగ తో మొదలు పెట్టాను..
Comments
Post a Comment