సోమనాథ్ -ద్వారక దర్శనం

గాంధీజీ పుట్టిన దేశం, సబర్మతి ఆశ్రమం, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార రంగంలో  స్థిరపడ్డ గుజ్జుల స్వస్థలం, కృష్ణయ్య సామ్రాజ్యం, సోమనాథ్ శిల్పకళా వైభవం..డోక్లా, ఖాండ్వి, థేప్ల ల పుట్టిల్లు.. "రాన్ ఆఫ్ కచ్" అనే ఉప్పు నీటి వల్ల ఏర్పడ్డ అతిపెద్ద ఎడారి...అదే అదే గుజరాత్ ప్రయాణం.

ఈ రోజే గో ఎయిర్ విమానం లో ఒక మాగజాయిన్ లో చదివాను, స్లో టూరిజం గురించి.

కేవలం టిక్ మార్క్ పెట్టుకోవడానికి కాకుండా అనుభవించడానికి పర్యటనలు చేయాలి అని. అక్కడి స్థానిక ఆహారం తినాలి, స్థానికులతో గడపాలి, స్థానిక వాహనాలు లో తిరగాలి  వగైరా అని.నాకైతే కొత్త కొత్త ప్రదేశాలు చూడటం చాలా ఇష్టం. అది టిక్ మార్క్ కో  మరెందుకైనా సరే.

మొదటి రోజు కేవలం అక్షర ధామ్. ఢిల్లీలో చూసినా ఇక్కడేo స్పెషలో చూడాలి.

సౌండ్ అండ్ లైట్ షో , లేజర్ షో లు చాలా చూసిఉంటారు. నేను మైసూరులో, లుంబిని లో, ఓర్లాండో లో  యూనివర్సల్ స్టూడియో లోనైతే అద్భుతమైన లేజర్ షో చూసాము .

అక్షరాధామ్ లో వాటర్ లేజర్ షో అంటే అక్కడున్న ఉక్కుపోతకి, వేడికి వద్దు లే అనుకుంటే  మీరు చాలా మిస్సయినట్టే.
(మతసంబంధమైనది అనుకుంటే ఏం చేయలేం కానీ) నచికేతుడి కథ, ఒక చక్కటి మెసేజ్ తో చాలా  బ్రహ్హండం గా అనిపించింది.

ఇంకా చెప్పాలంటే, 4డి షో లా అక్కడ వర్షం పడితే చల్లగా, అగ్ని గోళాలు వస్తే వేడి కూడా మన అనుభవం లోకి వస్తుంది. కేవలం సంగీతం దానికి జల నృత్యం కాదు ఒక పురాణం లోని స్కిట్ నీళ్లు లేజర్ సాయం తో ప్రదర్శిస్తారు. తప్పక ఓపిక తో చూడండి.

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిజంగా ఉక్కుతోనే 182 మీ పొడవు తో  నర్మదా నది పై నిర్మించిన సర్దార్ సరోవర్ డాం ను చూస్తున్నట్టు నిల్చుని ఉంటుంది. ఆ మేరు నగ ధీరుని చూస్తే ఒళ్ళు ఒక్క సారిగా గగుర్పొడిచింది. ఎక్కవ అలంకరణలు ,హంగులు పొంగులు లేకుండా , నా ధైర్యం ,స్థైర్యం ధీరత్వము, సాహసం, బుద్ధి కుశలతలే నాకు భూషణాలు, అలంకరణలు అన్నట్టుగా... ఆ విగ్రహాన్ని మనసులో  క్షణ కాలం తల్చుకుంటే చాలు ఎలాంటి కష్ట ,నష్ట సమయాల్లో కూడా మనం మళ్ళీ లేచి పోరాడే స్ఫూర్తి నిచ్చే ట్టుగా ఉంది.
లిఫ్ట్ లో విగ్రహం ఛాతి భాగం వరకు వెళ్ళొచ్చు. పాదాల కింద ఒక చక్కటి మ్యూజియం థియేటర్ లు గాలరీలు ఉన్నాయిఈ శిల్పం ప్రపంచంలో నే పొడవైనది, చైనా లోని స్ప్రింగ్ టెంపుల్ లోని బుద్ద విగ్రహం కంటే , అమెరికా లోని స్టాచు ఆఫ్ లిబెర్టీ కంటె పెద్దది. అక్కడే డాం,   కూడా చూపిస్తారు.
ఇంకా అక్కడంతా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 


ద్వారకా ఆ పేరు వినగానే ఎంతో ఎగ్సైట్మెంట్ అనిపించింది. చిన్ని కృష్ణుని లీలా  విశేషాలు..సాహస గాథలు విని చూసి తాను తిరిగిన స్థలం , అక్కడ ఏముందో అని కుతూహలం..అన్నిటితో వెళ్ళాం. గోమటి ద్వారక.. అది ఒక అనిర్వచనీయమైన అద్భుతం..ఆ కృష్ణ భగవానుడు ఒక 150 ఫీట్ల అపురూప శిల్పకళా గోచరితం..ఏకశిలా కృతమైన అంత పెద్ద ఆలయం తో సహా  స్వయంభూ: గా వెలిసాడని తెలిసినప్పుడు నమ్మశక్యం గా అనిపించిలేదు. 

సుమారు 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ద్వారక  నగరాన్ని (సామ్రాజ్యాన్ని) పరిపాలించాక ఆయన శరీరాన్ని పరిత్యజించిన 7 వ రోజే  విశ్వకర్మ స్వయానా నిర్మించిన ఆ రాజ భవనాలు మొత్తము సునామి వచ్చి మునిగి పోయాయి. తర్వాత..అతని మునిమనువడైన వజ్ర నాభుడు ఇక్కడ కృష్ణుడి ఆలయం ఉండాలి అని సంకల్పించగా వెలిసిన ఆలయం. ఎవరూ కట్టని ఆలయం. (??)ఇది హెరిటేజ్ సైట్ కూడా. సాధారణంగా ఉత్తర భారత దేశం లోని గుళ్ళు  దక్షిణానికి భిన్నంగా నాయస శిల్పకళ తో ఉండి అందంగా ఉంటాయి గర్భగుడిలో ములవిగ్రహాలు కూడా కనులవిందు చేస్తుంటాయి. ద్రావిడ సంప్రదాయ గుడిలో ఒక రక మైన పవిత్రతను తరంగిపచేస్తుంటాయి( నా వ్యక్తిగత అభిప్రాయం).
కానీ ఈ గుడిలో మనకు ఒకరకమైన అద్వితీయ మయిన భావన కలుగుతుంది.

గోపురం పైన 40 మీటర్ల వస్త్రం తో చేసిన జెండా ఎగుర వేస్తారు. వీటిపై సూర్యుడు చంద్రుడు తప్పక  ఉంటాయి. ఇవి రోజుకు అయిదు..ఉదయం మూడు సాయంత్రం రెండు వేసి నవి మళ్ళీ వేయకుండా మారుస్తారు. భక్తులు వీటిని సమర్పిస్తారు. 2023 వరకు బుక్ అయి ఉన్నాయట.
లోపలికి  ఫోన్స్, కెమెరాలు తీసుకెళ్లనీయరు.

తప్పకుండా  చూడాల్సిన ప్రదేశం నాకైతే చాలా చాలా నచ్చింది.
ఏ ప్రదేశానికి వెళ్లినా ఎవరిని కలసినా అక్కడ  ఏం నేర్చుకోవచ్చు అన్న కోణం లో చూస్తే  ఇక్కడ రెండు విషయాలు.

1. ద్వారాకాధీశుడి గుడిలో విశేషం ఆ కృష్ణయ్యకు అభిముఖంగా దేవకి మాత గర్భగుడి  ఉంటుంది. ఉదయం ఆలయం తలుపులు తెరవగానే మొదటగా అమ్మను దర్శించాకే వేరే ఏదైనా.. తల్లి తండ్రుల గొప్పదనాన్ని వారికివ్వవాల్సిన స్థానాన్ని గురించి తెలియచెప్తుంది.

2.  రుక్మిణీకృష్ణులు  దుర్వాస మునిని భోజనానికి ఆహ్వానించి ,రుక్మిణికి దాహం వేయడంతో పతి సృష్టించిన నీరు త్రాగగా ముక్కోపి అయిన ఆ దుర్వాస మహాముని వారిని 12 సంవత్సరాలు ఎడబాటు తో ఉండాలని అలాగే ఆ ద్వారక ప్రాంతం మొత్తం మంచినీరే దొరకబోదని శపించాడు.అందుకే  రుక్మిణి , కృష్ణుని ఆలయాలు విడివిడిగా ఉంటాయి ఇక్కడ.

సరే ఇందులో నేర్చుకునేందుకు ఏముంది? మన పదవి , డబ్బు, అందం, దర్పం చూసుకొని  విర్రవీగకూడదని అంతరార్థం. ఎంత ఎదిగినా ఒదిగే ఉండడమే గొప్పదనం అని తాత్పర్యం.

మొత్తానికి ద్వారక చారధామ్ లో ఒక ధామ్. (రామేశ్వరం,పూరి జగన్నాధ్, బద్రినాథ్, ద్వారాకాధీశుడు)
అన్నదానం లేదా అటుకుల దానం ఇక్కడ చేస్తే చాలా మంచిది.

బేంట్ ద్వారక : గోమటి ద్వారాక నుంచి ఓఖా ద్వారక వద్ద సముద్రం లో పడవ ఎక్కితే పదిహేను నిమిషాల్లో బేంట్ ద్వారక చేరుకోవచ్చు. ఇది ఒక ద్వీపం లో ఉంది. బేంట్ అంటే బహుమతి. మనకందరికీ తెలిసిన కృష్ణ -కుచేలా కథ జరిగిన స్థలం. పోరుబందరు లో జన్మించిన సుధాముడు..(అదే కుచేలుడు)  తన బాల్య మిత్రుడు శ్రీ కృష్ణుడు ద్వారకాధీశుడయ్యాడని తెలిసి..భార్య సలహాపై (స్నేహితుడి పై ఉన్న అభిమానంతో) కావటానికి వచ్చి ఏమి విలువైన బహుమతులు తేలేకపోయానని అటుకులు ఇచ్చిన స్థలం.

ఈ ఊరిలో సింహ భాగం ముస్లిం జనాభా నివసిస్తారు. వీరు చేపలు పట్టటం, టూరిజం ద్వారా జీవనం సాగిస్తారు
ఇక్కడ ప్రభుత్వం లేదా గుడి సంబంధించిన వాళ్లు పూనుకొని కొంచెం పరిసరాల శుచి శుభ్రత, అభివృద్ధి పై దృష్టి పెట్టాల్సి ఉంది

వజ్రాన్ని ఎంత సాన పడితే అంత కాంతివంతంగా తయారవుతుంది అన్న నానుడి సోమనాథ్ విషయం లో నిరూపితం అవుతుంది.

1024 నుంచి 1665 వరకు గజనీ మహమ్మద్ నుండి ఔ రంగ జెబు వరకు అజ్ఞానం తోనో అహంకారం తోనో ,అత్యాశతోనో ఒకే ఆలయాన్ని ఎన్నిసార్లు ధ్వంసం చేసినా ప్రతీసారీ మునుపటిమించిన సౌందర్యం శోభలతో భారత చరిత్రలో నిలిచిన( నాకు తెలిసినంత వరకు) ఏకైక  ఆలయం .

చంద్రుడు తన మామ దక్షుడు ఇచ్చిన శాపాన్ని తొలగించుకోవటానికి సోమనాథు ని రూపంలో శివుని శ్రద్ధాభక్తులతో ఇక్కడ పూజిస్తాడు. మెచ్చిన శివుడు శాపవిముక్తి అనుగ్రహిస్తాడు. అలా మొదటి గా ఇక్కడ ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ క్షేత్రం వేసినట్టుగా చెప్తారు. తర్వాత చాలాసార్లు తురుష్కులు, ఢిల్లీ సుల్తాన్లు, పోర్చుగీస్ వారు, మహమ్మదీయులు దండెత్తి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ప్రతీసారి రాజులు మళ్ళీ నిర్మించారు.

ఇప్పుడున్న ఆలయం 1951 లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో  స్వతంత్ర భారత దేశ మొట్టమొదటి రాష్ట్ర పతి డా బాబు రాజేంద్రప్రసాద్ చే ప్రారంభించబడ్డది .

అరేబియా సముద్రపు హోరు జై సోమనాథ్ అని నినదిస్తుండగా, ఆ సాగరంపై అలల లో నున్న తడిని తమతో మోసుకు వచ్చి వీచే పెనుగాలులు   మనల్ని  అలా సుతారంగా నెట్టేస్తుంటాయి.(గుడిలోకి).

ఆలయం మొత్తం చాళుక్య శిల్పకళా రీతిలో.. సునిశితంగా గా చెక్కిన భిన్న విభిన్న శిల్పసంపదతో కనువిందు చేస్తుంది. ఎక్కువగా లతలు ,జాలి లాంటిది, పూవుల డిజైన్లు కనిపిస్తాయి.(ఇలాంటి అద్భుతమైన శిల్పకళా బెలూరు, హాలేబిడ్, కొంత రామప్ప గుళ్లలోను చూస్తాం) రాత్రిపూట ఫసాడ్ లైటింగ్ తో రంగులు విద్యుత్తు కాంతితో మెరిసిపోతుంది. సాయంత్రం 7:30 కి సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది.     పక్కనే పాత సోమనాథ్ ఆలయం కూడా ఉంటుంది.

ఉత్తర భారత గుళ్లలో హారతి కి చాలా విశిష్టత ఉంటుందని భక్తులు భావిస్తారు కాబోలు..ఆ సమయంలో విపరితమయిన రద్దీ ఉంటుంది. మనము చేతులు జోడించి నమస్కారం  చేసినట్టు, వాళ్ళు రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తారు.(ఆ భగవానునికి దాసోహం అని అర్థం ఆట).

 విధ్వంసానికంటే సృష్టి కున్న శక్తి ఎంతో గొప్పది.

పాండవులు మహాభారత యుద్ధం ముగిశాక తమ సోదరులనే హతమార్చాల్సి వచ్చి పాపం మూట కట్టుకున్నామని ఎంతో  భాధ పడి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని వేడగా ఒక నల్ల ఆవును నల్ల జండా ను ఇచ్చి వాటి వెనుకాల వెళ్లి ఎక్కడైతే అవి రెండూ తెల్లగా మారుతాయో అక్కడ శివుని తపస్సు చేస్తే పాప పరిహారం అవుతుందని చెప్పాడు. అలా పాండవులు వెళ్తూ ఉండగా భావనగర్ కు 25 కిమి దూరంలో కోయిలక్ అనే గ్రామములో అరేబియా సముద్ర తీరంలో ఆవు జండా తెల్లగా మారగా అక్కడే పంచ పాండవులు ఆ పరమశివుని ప్రార్థిస్తూ తపస్సు చేస్తారు. అప్పుడు అయిదు లింగాల రూపంలో శివుడు అక్కడ ఉద్భవిస్తాడు. నిష్కలంక మహాదేవ్ అని పేరు పెట్టారు, కళంక రహితుడని, పవిత్రుడని అలా పెట్టారట.

ఆ తర్వాత కాలక్రమేణా సముద్రం ఆ ప్రాంతాన్ని కప్పి వేస్తూ ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఈవలకి వచ్చింది

విచిత్రమెంటటే ప్రతీ రోజు ఆ సాగరుడు రోజుకి రెండు సార్లు ఆ నిష్కలంక మహాదేవ్ కు వెనక్కి వెళ్తుంది. ఉదయం మరియు రాత్రి.

మేము వెళ్లినప్పుడు సాయంత్రం 5 అయ్యినది సుదూరంగా ఒక ఫీటు ఫీటున్నర జండా కనిపించింది. రాత్రి 8, 8:30 వరకు నీరంతా వె నక్కి వెళ్తుందని అక్కడి వాళ్లు చెప్తే అసలు నమ్మబుద్ధి కాలే. ఒక్క గంటకి సుమారు 4 ఫీట్లు వెనక్కి వెళ్ళింది ..ఈ లెక్కన 9 వరకు అసలు కుదరదనుకున్నాం. అలా వెళ్లి హోటల్ లో టీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకునే సరికి కళ్ళు పొడుచుకున్నా కానరాని చీకటి అయ్యింది. అక్కడ ఒక చిన్న లైట్ కాదు కదా..కందిలి దీపం కూడా లేదు

కొందరు భయం తో  వెళ్లడం వద్దని కొందరు ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే అని తర్జనభర్జనలు మొదలయ్యాయి

ఇంతలో కొందరు వెళ్లి సమాచారం సేకరించారు..ఇద్దరు పూజారులు ఉంటారు ఒకవేళ యాత్రికులు ఆడిగితే వారు టార్చ్ లతో మనకు దారి చూపిస్తూ వచ్చి అభిషేకం కూడా చేయిస్తారు అని. ఇక బయలుదేరాం అందరం ..మనసులో భయం, వెన్నులో వణుకు వెళ్లాలని ఆత్రం.. అంత విచిత్రాన్ని భగవంతుని అద్భుతమైన లీలను దర్శించుకోవాలనే తపన తో బయలుదేరాం.

అలా వెళ్తున్నకొద్ది అసలు సముద్రం హోరె లేదు ఫోన్ వెలుతురు లో మట్టి నేల కనిపిస్తోంది. అది కూడా గట్టిగా కాంక్రీటు వేసినట్టుగా ఉంది నేల.. అక్కడ అక్కడా సన్నని నీళ్ల ధారలు వెనక్కి వెళ్తూ కాళ్ళని కడుగుతున్నాయి

Comments