రాస్తున్నా..రాసేస్తున్న

రాస్తున్నా..రాసేస్తున్న

జ్ఞాపకాల దొంతరలను
కదిపి కదిపి దులిపి దులిపి
జారిపడిన అనుభవాలను
అనుగుణంగా వేరుచేసి
సంతోషపు మూటలన్ని
తరచి తరచి... నలిపి చూసి
మది అరలలో పైపైన పరిచి

కఠినమైన గుర్తులన్ని
భద్రంగా మడత పెట్టి
అర అడుగున అట్టిపెట్టి
వాటి పాఠాలను రంగరించి
రుచిని కలిపి అందరికి పంచిపెట్టి

మస్తిష్కపు మూలలలో
మాగి ఉన్న చిలిపి గుర్తులన్ని
చల్లచేసి చిలికి చిలికి
తేలిన తెల్లని వెన్న
కరగకుండా దాచిపెట్టి

రాబోయేఅనుభవాలకు
ఆహ్వానం పలికి
తినబోయే రుచులకు
తీయదనం కలిపి

రాయమని.. రాసి పారేయమని
ఇచ్చిన పిలుపుని అందుకొని
ఆలోచించి..ఆత్రపడి
రాయలనుకుంటున్నా
కొత్తగా అబ్బిన
కళలకు న్యాయం చేసేయాలని..
రాయలనుకుంటున్నా

                     .... వంగీపురం ప్రశాంతి

Comments

Post a Comment