రెండ్రోజులు బ్రేక్ కావాలా ? అయితే ఇదిగో గోకర్ణ,మురుడేశ్వర్, విభూతిఫాల్స్.

ఏడాదిన్నర నుంచి అతి బిజీ షెడ్యూల్ నుంచి బయట పడటానికి  మోనాటనస్ రొటీన్ నుంచి ఒక బ్రేక్ కు ఒక అద్భుతమైన జలపాతం , కొన్ని బీచ్ లు ఒక దేవాలయం , రైలు ప్రయాణం  ఎలా ఉంటుంది.. మంచి కంపెనీ తో వెళ్తే అదిరిపోతుంది. నాకైతే  ఎలా ఉన్నా బానే ఉంటుంది. అదే ఇది.

కరోనా పుణ్యమా అని దాదాపు  రెండు సంవత్సరాలనుండి అన్ని టూర్ లు క్యాన్సిల్ అయ్యాయి. చివరిది 2019 లో బాందవగడ్ టైగర్ రిజర్వ్ ..ఆ తర్వాత ఇక కరోనా, ఫారిన్ ట్రావెలర్ లు, కంటైన్మెంట్ జోన్ లు, లాక్డౌన్ లు బాధితుల కష్టాలు అన్ని అందరికి తెలిసినవే ఇప్పటికి ఇంకా నవంబర్ కు కానీ అమెరికా ట్రావెల్ బాన్ తీయట్లేదు.  పోయిన నెల కరీంనగర్ జిల్లా కోటిలింగాల ధర్మపురి కొండగట్టు ఒక రోజు ట్రిప్ వెళ్ళాం అనుకోండి... కానీ కొంచెం దూరంగా ప్రకృతి ని ఆస్వాదించేందుకు ఈ సారి వెదికి వెదికి గోకర్ణ, మురుడేశ్వర్, విభూతి ఫాల్స్ ట్రిప్ సైన్ అప్ చేసాం.( ఫామిలీ)   మీటప్ అప్ లోదాదాపు చాలా ఏళ్ల నుంచి మెంబర్ని కానీ అందులో వాళ్ళ ప్యాకేజి లు చూడడమే తప్ప ఎప్పుడు వెళ్ళలేదు. ఈ సారి బ్యాక్ పాకర్స్ అండ్ సిటీ ఫ్రీక్స్ గ్రూప్ వాళ్ళ ట్రిప్ ప్లాన్ ఇది. చూస్తే ప్రతి శుక్ర వారం ఉంది ,ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఫైనల్ చేసాం.

హుబ్లీ ఎక్స్ప్రెస్ సాయంత్రం మూడు యాభై కు నాంపల్లి నుండి బయలు దేరుతుంది.. మొత్తం ఇరవై మందిమి అందులో ముగ్గురు చెన్నై నుండి బస్ లో  వస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు హుబ్లీ లో దిగుతాం ...ఆ రైల్వే స్టేషన్ ఆసియా లో రెండవ అతి పొడుగైన రైల్వే స్టేషన్ అట... అక్కడి నుంచి అందరం టెంపో ట్రవెల్లెర్ లో గోకర్ణ బయలు దేరాం. దూరం 150 కి మీ అయినా ఘాట్ రోడ్ కాబట్టి ఐదు గంటలు పట్టింది. మధ్యలో హుబ్లీ దాటంగానే మహాలక్ష్మి హోటల్ అని రోడ్ పైనే ఉంటుంది(చాలానే ఉంటాయి మేము ఇక్కడ ఆగాము)  అక్కడ కొంచెం ఫ్రెష్ అయి టీ, టిఫిన్ తాగొచ్చు బానే ఉంటాయి.. 

ఎంతో ఉత్సాహంగా గోకర్ణ వచ్చాము అందరూ బీచ్ కాస్ట్యూమ్స్ లలో .అక్కడ బీచ్ లో అలలు ఎంతో ఎత్తులో ఎగసి ఎగసి పడుతూ రండి రండి అని కవ్విస్తున్నట్టు ఉంది...అక్కడ కొన్నాళ్ల క్రితం నలుగురైదుగురు నీళ్ళల్లో కొట్టుకుపోయారని ..నీళ్లకు ఒక 10 మీటర్ల వరకు కూడా ఎవ్వరిని వెళ్ళనివ్వట్లేదు.. అందరం తెగ నిరుత్సాహ పడిపోయాం.  ఆ బీచ్ కు ఆనుకోని మహాబలేశ్వర గుడి, ఒక గణపతి గుడి ఉంటాయి. పెద్దలకు తర్పణాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా మాకు కనిపించారు.  ఇక్కడి శివ లింగం ఆవు చెవి రూపం లో ఉంటుందని గో (ఆవు) కర్ణం ( చెవి) అని పేరు వచ్చింది.  రకరకాలు సుగంధ ద్రవ్యాలు , సామ్రాణి చాలా దుకాణాల్లో అమ్ముతున్నారు. 

ఈ ఊరిలో  దాదాపు ఎనిమిది పైనే బీచ్ లు ఉన్నాయి ..తర్వాత మేము కుడలే బీచ్ కు వెళ్ళాం (ట్రెక్ లో). ఆటో లో వెళ్తే వంద రూపాయలు. ఈ బీచ్ ప్రకృతి అనే అమ్మాయి         ఆకు పచ్చని చెట్లనే చీర , లేత నీలం సంద్రాన్ని అంచులా చుట్టుకున్నట్టు పక్కనే శిక్షణ పొందిన సైనికుల్లా నిలబడ్డ కొండలు మనల్ని  మైమరిపస్తాయి చాలా రిసార్టులు, హోమ్ స్టే లు ఉన్నాయి చుట్టూ. ఎవ్వరికి  కనిపించకుండా కేవలం నేచర్ తో ఉండాలని అనుకునే వాళ్లకు మంచి ఎస్కేప్.  ధరలు కూడా మామూలుగానే ఉన్నాయి.  ఈ బీచ్ కొంచెంనయం నీళ్ళతో కొంత దూరం వరకు ఆస్వాదించేందుకు అవకాశం దొరికింది...అలా కాసేపు అయింతర్వాత ..ఆ అంచులో ఉన్న చాలా హోటళ్లలో ఒక చోట లంచ్ పూర్తి చేసాం. మాకు తెల్సిన సమాచారం మేరకు  ఓషన్ ఫ్రంట్ వ్యూ.. సన్ సెట్ బాగుంటాయి. వచ్ఛే దారిలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి కొండ దిగేప్పుడు ట్రై చెయ్యొచ్చు. 


అక్కడ నుంచి ఇరవై నిమిషాల ట్రెక్ లో ఓం బీచ్ కు వెళ్ళొచ్ఛు... ఈ బీచ్ కు ఆ పేరు ఎందుకు వచ్చింది అని కొంత పరిశీలించగా రాళ్లన్నీ ఓం (ఉల్టా)  షేప్ లో పేర్చినట్టు ఉంటాయి. ఇక్కడ బీచ్ లో చాలా రాళ్లు  ఉన్నాయి. అలల తాకిడి ని తట్టుకుంటూ క్రమేపి శిథిలమవుతూ.... బీచ్ కు  బార్డర్ లా అన్ని కొబ్బరి చెట్లతో సినిమాల్లో, ఫొటో ఫ్రేములో  తరచూ చూసే సీన్ లా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంజాయ్ చేస్తారట.

(photo courtesy: google) అంతే ఇంక అక్కడ నుంచి మురుదేశ్వర్ బయలుదేరాం. రాత్రి ఎనిమిదింటికి అక్కడ బీచ్ కు ఒక 100 మీ సమీపంలోనే ఉన్న ఒక హోంస్టే లో బస. కిటికీ లోంచి సముద్రపు హోరు, అతి దగ్గరలో మురుడేశ్వరుడి గుడి దీపాలు ఎంతో ఉల్లాసం కలిగించాయి. ఉదయం ఐదింటికే మా వాళ్ళు బీచ్ లో వాకింగ్ కు వెళ్లారు... తర్వాత అందరం గంతులు వేసుకుంటూ.. సముద్రం (అరేబియా)దగ్గరికి వాలిపోయము...,  చివరంటూ కనిపించని నీళ్లు,  ఇసుక తిన్నెలు...సముద్రపు జీవుల ఆల్చిప్పలు.. అన్ని రకాల సైజుల శంఖులు,  అలలతో సయ్యటాలు .....ఇక ఫోన్ లకు విరామం లేదు ,ఫోజు లకు అంతే లేదు...తర్వాత తయారై మురుడేశ్వర్ గుడికి బయలు దేరాం... చక్కగా మా హోమ్ స్టే నుంచి బీచ్ లో( కాళ్ళని నీళ్లలో తడిపిస్తూ మనలోని పసితనాన్ని నిద్ర లేపుతూ... ఆఫ్ కోర్సు మాములుగా కూడా  వెళ్ళొచ్ఛు 😊)   ఒక 500 మీటర్లు వెళ్తే వచ్చేస్తుంది ...గుడి గోపురం   ఇరవై అంతస్తులతో "నాకెవరు లేరు సాటి" అన్నట్టుగా ఠీవిగా నిల్చొని ఉంటుంది ముందర గజారాజులు ద్వార పాలకుల్లా కొలువు దీరగా. (లిఫ్ట్ లో పై వరకు వెళ్లి ద్వీప కల్పం లా ఉన్న గుడి అందాల్ని చూడవచ్చు.)

లోపల గర్భ గుడిలో స్వామి వారు (శివుడు) పక్కన అమ్మవారు ఉంటారు. కొంచెం పైన కొత్తగా ఏర్పాటు చేసిన పార్క్ అందులో పెద్ద కైలాసనాథుని విగ్రహం...కృష్ణార్జునులతో కొలువు తీరిన రథం...రావణుడు ఆత్మలింగం కథ ను ప్రతిబింబించే విగ్రహాలు ఉంటాయి. 

మొత్తానికి బీచ్, గుడి కు టిక్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ మజిలీ విభూతి ఫాల్స్ ..             
మురుడేశ్వర్ నుంచి దాదాపు మూడు గంటలు ప్రయాణం.   బేస్ నుంచి అరగంట కొండ పైకి అందమైన ప్రకృతిలో స్వర్గానికి దారి నా అన్నట్టున్న దారిలో  ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే వస్తుంది... విభూతి జలపాతం...అంతే ఆ జల రవళి కి,  వాటి స్వచ్ఛతకు, ఆ స్థలానికి ఫిదా అయిపోయి వీలయిన వాళ్ళందరూ నీళ్ళల్లోకి   దూకేశారు.  ఇక బయటికి వస్తే గా... అక్కడే డైవ్ లు , ముక్కు మూసుకుని నీళ్ళల్లో మునగడాలు.. ఈతలు ,ఫోటోలు..ఉత్సాహంగా అరుపులు కేరింతలు... కష్టపడి ట్రైన్ టైం అవుతున్నదని మా ఆర్గనైజర్ అందర్నీ బయటికి కదిలించాడు. బేస్ లో ఒక చిన్ని హోటల్లో తాలి ( వెజ్, నాన్ వెజ్ ఉంటుంది) తిని హుబ్లీ బయలు దేరాం. హంగు పొంగు లతో లేక పోయినా ఆదరంగా పెట్టారు పర్లేదు తినొచ్చు లేదా కొంచెం హైవే లో మళ్ళీ అన్ని రకాల హోటళ్లు ఉంటాయి.. 

మొత్తం మీద మా ట్రిప్ ఒక్క గోకర్ణ బీచ్ లలో కల్గిన నిరుత్సాహం తప్పిస్తే చాలా బాగా జరిగింది. రాత్రి 8.50 కు తిరుగు ట్రైన్ హైదరాబాద్ కు.. 

శుక్రవారం మధ్యాహ్నం నుండి సోమవారం మధ్యాహ్నం వరకు కేటాయించ గలిగితే మంచి ట్రిప్. తప్పక చూడండి.

nd

Comments

  1. ప్రకృతి తో మమేకమైన దేవాలయం, సూర్య సాగర సుందర దృశ్యం మధురనుభూతి👍🏾

    ReplyDelete
  2. Gd eve madam.Me also planning with family members during sankranthi holidays . by covering Dharmasthala,sringeri, udupi, in my own driving

    ReplyDelete

Post a Comment