ఈ రోజు నా చేతి వంట ...ఈ రోజే కాదు గత పది రోజులుగా నా చేతి వంటనే... అంటే నాకు వంట రాదని కాదు. నేను చేయనని కాదు. పెళ్ళైన దగ్గర్నుంచి ఇరవై ఏళ్ళ పాటు రెండు పూటలు రెండేళ్ల పాటు ఒక పూట నేనే వంట చేసాను. గత నాలుగైదు ఏళ్లనుంచి నాకు వంట నుంచి ఉద్యోగ బరువు బాధ్యతల నెపం తో తెరపి దొరికింది. మా అమ్మ వాళ్ళింట్లో ఎప్పుడూ నా చేత టీ కూడా చేయించలే అందుకే నాకు అసలు ఏమి రావు తినడం తప్ప... ఇంటర్ పూర్తవ్వంగానే పెళ్లయిన నాకు ఇక మొదలయ్యింది ఈ వంట బాధ్యత. నిజ్జం నాకు అస్సలు అన్నము చెయ్యడం కూడా రాదు. కొన్ని రోజులు ప్రయత్నాలలో ఉండగానే ప్రేగ్నెన్సీ తో ఒకటే నాసియా ...నా వంట నాకే నచ్చేది కాదు. మా ఆయన కోసం వండినా నాకు అవి చూస్తేనే కడుపులో తిప్పేది. మొత్తానికి అలా అలా ఏదో తప్పని సరై నేర్చుకున్నా . ఇక పిల్లలకు స్కూలు కెళ్లేటపుడు వారికొరకై ఒక షెడ్యూల్ పెట్టుకునే దాన్ని . వాళ్లేపూటా అన్నము తినరు... ఒక పూట తిన్నది, మరో పూట తినరు...ఇంకా ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు.. ( అలా అని మంకు పట్టు పట్టేవాళ్ళేం కాదు నాదే తల్లి ప్రేమ).
నాకు రాదని కాదు కాని ఒకటే రుచులు కోరి ఆస్వాదించే టైప్ కాదు. ఆకలేస్తే ఏదో ఒకటి తినేయ్యాలి కడుపు నింపుకోవడానికి అని నా అభిమతం. మా ఆయన ,మా పెద్దబ్బాయి దీని కి పూర్తి విరుద్ధం. మొత్తానికి అలా మా సిల్వర్ జూబ్లీ కూడా గడిచిపోయింది.
నా దృష్ఠిలో ఈ వంట తినడం అనేవి ఎంత క్లిష్టమయిన ప్రక్రియలు అంటే..అసలు రోజూ వండుకోవడం, తినడం ,కడుక్కోవడం ఎవరు కనిపెట్టర్రా బాబు అని నేను అనుకోని రోజు లేదు. రోజు ఉదయాన్నే లేవంగానే ఇవాళ ఏం చెయ్యాలి ఒక పెద్ద ప్లానింగ్..దాన్లో ఏన్నో అడ్డంకులు... కొన్ని కూరగాయలు వాతం చేస్తాయి, కొన్ని ఆయుర్వేద మందులకు పథ్యం.. కొన్ని కాశీ లో వదిలేస్తారు..కొన్ని నచ్చవు. అన్ని బాలన్స్ చేస్తూ చెయ్యాలి. అసలు ఒక టాబ్లెట్ రూపంలో ఉండి పుటకొక్కటో రెండో వేసుకునే లా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటా అప్పుడప్పుడూ.
మంచి వంటకాతో ఇంకో ఇబ్బంది కూడా ఉంది...బాగా లాగించేసి ఒళ్లు పెంచేసి తగ్గించడానికి నానావస్థలు పడాలి. కొందరైతే ఎంత తిన్న లావె అవరు ..వాళ్ల శరీరం తీరు..(మెటబాలిజం) అదృష్టవంతులు.
సరే మళ్లీ టాపిక్ లోకి మా వంట చేసే
అమ్మాయి గత పది రోజులు ఏదో పనివల్ల రావడం లేదు.దాంతో ఇక నా వంట పర్వం మొదలయ్యింది.
మొదటి రోజు కొంత ఫోకస్ గా చేశా.. ఇక మా అబ్బాయి ,అత్తగారు, మా ఆయన ఆహా ఓహో అంటూ తిన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది.. నా వంట కూడా ఇష్టం గా తింటున్నారే అని. ఈ రోజు సెలవు.. ఇంట్లో వాళ్ళ ప్రశంసలు గుర్తు తెచ్చుకొని ఆ స్ఫూర్తి తో ట్రెడిషనల్ గా గా మోర్ కొళంబు, కూటు చేశా. అదే ఈ రెసిపీ (కూటు తర్వాత యాడ్ చేస్తా)
బియ్యం గింజలు, 1 స్పూన్
ధనియాలు, 1 స్పూన్
పచ్చి/ఎండు మిరపకాయలు, (నాలుగైదు)
పచ్చి కొబ్బరి ఒక కప్పు నాన బెట్టుకుని రుబ్బుకోవాలి.
పుల్ల మజ్జిగలో ఈ పేస్ట్ కలిపి పెట్టుకోవాలి. బెండకాయ, సొరకాయ, గుమ్మడికాయ లాంటి ఏవైనా కూరగాయలు ఒక బాండలి లో నెయ్యి తిర్గవాత(పోపు) (కొంచెం సన్నగా తరిగిన అల్లమ్ కూడా వేగాక) లో వేసి ఉడికించుకోవాలి. తర్వాత పుల్ల మంజ్జిగ ఇందులో కలిపి మీది నుంచి కరివేపాకు కొత్తిమీర వేసి మర్ల నివ్వాలి.ఒక ఐదు నిమిషాల తర్వాత ఘుమ ఘుమ వాసన రాగానే దింపుకోవాలి.
మాటకేం గాని చాలా బాగా వచ్చింది .
Comments
Post a Comment