సెవెన్ సిస్టర్స్ అని పేరు గాంచిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు ఇతర భారత భూభాగానికి కాస్త ఎడంగా (మధ్యలో బంగ్లాదేశ్ చొచ్చుకొని రావడంతో) తక్కువ కనెక్టివీటి తో ఉన్నందు వల్లనో లేక కొండలు గుట్టలు లోయలు లాంటి కఠినమయిన భౌగోళిక స్వరూపం తో ఉండటం మూలానో ఇంకా ఈ (అ) సభ్య సమాజం బారిన పడలేదు.
సహజ వన్యప్రాణి సంపద, అందమైన ప్రకృతి, అడవులు, పర్వత శ్రేణిలు, లోయలు స్వచ్ఛమైన, అమాయక మనుషులు, అందమైన లెక్కపెట్టలేని, వెలకట్టలేని జలపాతాలు, చెట్టు , చేమ ,పుట్ట ,పూవు మేఘాలయ సొంతం.
నార్త్ ఈస్ట్ ఎప్పట్నుంచో బకెట్ లిస్ట్ లో ఉన్నా ప్రయాణం ఇన్నాళ్లకు కుదిరింది.
7 రోజులు రాను పోను కలిపి. చెన్నై నుంచి ముగ్గురు, మైసూర్ నుంచి ఇద్దరు హైదరాబాద్ నుంచి ఇద్దరు మొత్తం 7 మందిమి బయలుదేరాము . ( 7 లక్కీ నంబర్ లాగుంది ఇప్పుడే తట్టింది 🙂) గౌహటి(అస్సాం) లో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలాండ్ ఇంటర్నేషల్ ఎయిర్పోర్ట్ లో దిగాము. అక్కడినుంచి షిల్లాంగ్ ( మేఘాలయ రాజధాని మరియు ఆ రాష్ట్ర సెంటర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు) కేవలం 100 కి మీ మాత్రమే. ఒక హోటల్ లో లంచ్ చేసుకొని గౌహతి నుంచి దాదాపు సాయంత్రం నాలుగు గంటలకు షిల్లాంగ్ కు బయలుదేరాము.
షిల్లాంగ్ ఒక ఊటీ లాంటి హిల్ స్టేషన్ . ఇరుకు దారులు వాటి వెంబడి లోయల్లోకి అనుకున్న దుకాణాలు భవనాలు కనిపిస్తాయి. అక్కడ విపరీతమైన వర్షాలు కాబట్టి టూ వీలర్లు తక్కువ. అన్ని టాక్సీలు ,కార్లు విపరీతమైన ట్రాఫిక్ జామ్. మన హైద్రాబాద్, బెంగుళూరుకు ఏ మాత్రం తీసిపోదు ట్రాఫిక్ జాంలకు. ఇక్కడ రెయిన్ కోటో లేక గొడుగో లేకుంటే బయటకు వెళ్లలేం. ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం.
మేఘాలయ గారో, ఖాసి, మరియు ఝాన్తియా మూడు పర్వత శ్రేణులు ముఖ్యమైన
మూడు తెగలు ఉన్నాయి. ఖాసి (33%) గారో (30%) ఝాన్తియా (10%) ఉన్నారు. మిగిలినవి చిన్న చిన్న తెగలు. వింత ఏమిటంటే ఈ రాష్ట్ర అధికారిక భాష ఇంగ్లీష్. 74% ప్రజలు క్రిస్టియానిటి పాటిస్తారు. ( బ్రిటీషర్స్ కాలంలో జరిగిన మిషినరీస్ కన్వెర్షన్స్ వల్ల.)
ప్రపంచంలో నే మాతృస్వామ్యాన్ని ఇంకా పాటిస్తున్న అతి పెద్ద ప్రాంతాల్లో ఒక్కటి మేఘాలయ. ఇక్కడ తల్లులు ఇంటి పెద్దలు. చిన్న కూతురికి వారసత్వ ఆస్తులు మరియు బాధ్యతలు సంక్రమిస్తాయి. పెళ్ళితర్వాత అబ్బాయి అమ్మాయి ఇంటికి రావాలి. అమ్మాయి ఇంటిపేరు ఉంటుంది. ఇవన్నీ ఆర్యుల కాలంలో, శాతవాహన కాలంలో విన్నాం కానీ ఈ కాలంలో వింత గా అనిపిస్తుంది.
మొదటి రోజు షిల్లాంగ్ చేరడానికి రాత్రి ఆరున్నర పైనే అవడం అక్కడ అప్పటికే చీకటి పడటం జరిగిపోయింది. అందుకే కొంచెం ప్లాన్ మార్చాము.
1.మొదటి రోజు:
పోలీస్ బజార్ :ఇది మన కోఠి లాంటి మార్కెట్. చవకలో బట్టలు, బాగులు, ఉలన్ తో అల్లిన కోట్లు , స్వేటర్లు, రాక రకాల పళ్ళు, హ్యాండి క్రాఫ్ట్స్ ( బాంబ, కేన్, ఫైన్ పూలతో చేసినవి ) అక్కడ నేసిన శాలువలు, మఫ్లర్లు, ఇంకా చాలా దొరుకుతాయి. ఆ వీధిలో చాలా హోటల్స్, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. నాకు చాలా నచ్చిన విషయం. పూల మొక్కలు వీధిలో చక్కగా పెంచేసి పైన వీధి దీపాల కుడా వేలాడేశారు. ఎంతో అందంగా ఉన్నాయి. చిన్నగా షాపింగ్ చేసుకొని రిసా కాలనీ లో హోం స్టే కు వెళ్ళాం. కర్రతో కట్టిన మేఘాలయ సంప్రదాయ ఇల్లు అది. నాల్గు బెడ్ రూమ్ లు లివింగ్ రూమ్ కిచెన్ తో అందంగా ఉంది.
2. రెండవ రోజు:
ఉదయాన్నే 3 గంటలకు మెలకువ వచ్చింది చూద్దుము గదా మొత్తం తెల్లవారింది. ఆరు గంటల నుండి
వదలకుండా జిన జిన వాన. అరే ఎలా అనుకొని చివరకు 11కు వర్షం లోనే రైన్ కోట్( పాంచో) వేసుకుని బయలు దేరాం సెక్రెడ్ ఫారెస్ట్ కు .
సెక్రెడ్ ఫారెస్ట్ - మాఫ్లాంగ్ గ్రామo లో ఉన్న 80 హెక్టార్ల లో ఉన్న అతి సుందరమైన , దట్టమైన అటవీ ప్రాంతం. అందులో రుద్రాక్ష, పైన్, ఔషధ గుణాలున్న చాలా చెట్లతో పచ్చగా ఉంటుంది.
ఖాసి తెగ ప్రజలు ప్రకృతి మాత ను పూజిస్తారు. వారి కట్టుబాట్లు నియమాల ప్రకారం ఆ అడవి నుంచి పూచిక పుల్ల కూడా తీసుకెళ్లనివ్వరు. అలా తీసుకెళ్తే వారికి చెడు జరుగుతుందని నమ్ముతారు. మా గైడ్ జాన్ ఖాసి ప్రజల గురించి చాలా విషయాలు చెప్పాడు. అక్కడ వారికి ఆలయాలు విగ్రహారాధన ఉండదు. నిలువు రాళ్లు మగ అడ్డం రాళ్లు ఆడ వారికి ప్రతిరూపంగా పెడతారు అంతే.
ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్:అక్కడ్నుంచు ట్రెక్కింగ్ మరియు గుహలు వెళ్లాల్సి ఉంది కాని వర్షం కారణం గా మూసివేశారు కాబట్టి ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ లేదా త్రి స్టెప్ వాటర్ ఫాల్స్ చూసాం . ఆవేశం గా కొండల మధ్యలోంచి ఉబుకుతూ, ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న ఆ మూడు అంచెల నీళ్ళు ను చూస్తే కొంచెం భయంగా చాలా నూతనోత్సాహం గా అనిపించింది.
వార్డు లేక్. సిటీ మధ్యలో ఉన్న వార్డ్స్ లేక్ చిన్న సరస్సు. పార్కు మధ్యలో ఉంటుంది. బోటింగ్ ఉంటుంది కాసేపు సేదదీర్చుకోవచ్చు. ఉమ్యాం నది వ్యూ పాయింట్ కూడా చూసాం.
3.మూడవ రోజు:
పే పే వాటర్ ఫాల్స్: మేఘాలయా మొత్తాన్ని షిల్లాంగ్ లో ఉండి రోజూ వెళ్లి వచ్చి చూడవచ్చు. లేదా అక్కడి ప్రదేశాలు కొంచెం తనివితీరా ఆస్వాదించాలంటే ఆ యా గ్రామాల్లో బస చేయవచ్చు. దాదాపు ప్రతి టూరిస్టు స్పాట్ లో హోమ్ స్టే లు ఉంటాయి. మేము రెండో పద్దతి తీసుకున్నాం. షిల్లాంగ్ నుంచి మైలన్ గాంగ్( అతి శుభ్రమైన గ్రామం) మరియు రివాయి గ్రామము లోని లివింగ్ రూట్ బ్రిడ్జ్ కు బయలు దేరాం. దారిలో పే పే వాటర్ ఫాల్స్ కు వెళ్ళాం. అతి వర్షాల కారణం గా ఆ జలపాతానికి చాలా దూరం లో మా వాహనం ఆపారు.
చుట్టూ ఆకు పచ్చని పచ్చిక బయళ్లు. వాటి అంచుల్లో ముదురు ఆకుపచ్చ కొండలు మధ్య మధ్యలో తెల్లని జలధార లు. వాటికి జల జల మంటూ నీళ్లు హోరుమంటూ గాలి నేపథ్య సంగీతం (బాక్ గ్రాండ్ స్కోర్) లా వినిపిస్తుంది. అసలు భూమి మీద స్వర్గం అదే అనిపించింది. దాదాపు 5 కి మీ రాను అంతే పోను ట్రెక్కింగ్ చేస్తూ ఆ సహజ ఆవిష్కరణ ను చూసాం. అది ఒక మినీ నయాగారా అని చెప్పవచ్చు. తిరిగి వచ్చేప్పుడు ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఒకటే వాన మొదలయ్యింది . దానికి దగ్గరలో ఉన్న ఒక రిసార్ట్ లో వర్షం తగ్గేవరకు ఆగి అక్కడే భోజనం చేసి అలాగే బయలు దేరాం రివాయి గ్రామానికి.
దారి మొత్తం ఘాట్ రోడ్డు.. దారి పొడుగునా దట్టమైన పొగ మంచు ఒక రెండు మీటర్ల అవతల ఉన్నవి కూడా ఏమి కనిపించవు. జాగ్రత్తగా అతి నెమ్మదిగా రాత్రి తొమ్మిది గంటలకు చేరాము. అప్పుడే నిర్ణయించుకున్నాం..సాయంత్రం ఐదు వరకు ఖచ్చితంగా రూమ్ కు చేరు కోవాలి రోజు అని.
4. నాల్గవ రోజు:
రివాయి - మైలన్ గాంగ్ :రివాయి ఒక చిన్ని గ్రామం. ఇక్కడ ఏ క్షణం ఏ మూలలో ఫోన్ సిగ్నల్ ఇంటర్నెట్ వస్తుందో చెప్పడం చాలా కష్టం. విపరీతమైన వర్షం లేదా పొగ మంచు. ఇక్కడ ఉంటే దాదాపు బయట ప్రపంచంతో సంబంధాలు శూన్యం అని చెప్పవచ్చు.మర్నాడు ఉదయం నిద్ర లేవంగానే టీ లు తాగి ఆ పచ్చని ప్రకృతి లో అలా నడుచుకుంటూ బ్రతికి ఉన్న చెట్ల వేర్ల తో తయారు చేసిన లివింగ్ రూట్ బ్రిడ్జి కు బయలు దేరాం. అన్ని రకాల పూల, పళ్ళ మొక్కలు కొండలు జలపాతాల మధ్య అలా నడుస్తూ వెళ్తుంటే మనకు అవతల మరో ప్రపంచం ఉందని కానీ, మనకు మొబైల్ కనెక్షన్ లేదని కానీ ఏమీ గుర్తు ఉండదు. వేగపడక పోతే తమకేదో కొంప మునుగుతున్నట్టు హడావిడిగా ప్రవహిస్తున్న జల పాతం పైన చక్కటి జడ అల్లినట్టుగా మర్రి చెట్టు ఊడలను ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడానికి అనువుగా అల్లారు. ఎంతో ఆశ్చర్యంగా అబ్బురంగా అనిపించింది.
అక్కడినుంచి మా వాహనం లో మైలనగాంగ్ గ్రామం కు వెళ్లాo. (2 కి మీ దూరం అక్కడికి) ఆసియా లో నే అతి స్వచ్ఛమైన గ్రామము ఇది. చక్కటి రోడ్లు ఇరువైపులా చెట్లు, చూడముచ్చటగా ఉన్న ఇళ్లు అక్కడి ప్రజలు. మరియు యాత్రికులతో సందడిగా ఉంటుంది.ఇక్కడ పొగ, ఆల్కహాల్, డ్రగ్స్ గొడవలు పడటం నిషేధం. ఇక్కడ ఒక ట్రీ హౌస్ పై నుంచి ఆ సుందర ప్రదేశం అంతా చూడొచ్చు. బాంగ్లాదేశ్ గ్రామాలు, బార్డర్ కనిపిస్తుంది .
ఆ తర్వాత అక్కడునుంచి సోహ్ర (చిరపుంజి భాగాలు దేరాం). మేఘాలయాలో ఎక్కడ ఏ మూల ప్రయాణించినా స్వర్గం లో విహరిస్తున్నట్టు ఉంటుంది. మధ్యలో నర్తియాంగ్ మోనోలిత్ పార్క్ మరియు ప్రాచీన మైన దుర్గా దేవి గుడి ఉన్నాయి.
5. అయిదవ రోజు:
సోహ్ర లేదా చిరపుంజి కొంచెం పెద్ద మరియు పురాతన దర్శనీయ ప్రాంతం. ఇక్కడ ఆరేంజ్ రూట్స్ అని ఒక శాకాహార భోజనశాల ఉంటుంది. అక్కడ మనకు అన్ని దొరుకుతాయి. భూగోళ శాస్త్ర ప్రకారం 400 మీ మీ వర్షపాతం ఉంటే అత్యధిక వర్షపాతంగా భావిస్తారు. అల్లాంటిది ఇక్కడ 12000 మీ మీ సగటున సంవత్సరానికి నమోదు అవుతుంది. అంటే ఇంకా ఏముంటుంది...దాదాపు సాయంత్రం 5 నుండి ఉదయం 11 వరకు ఆగని దారపాతపు వర్షం. చాలా తక్కువ సమయం బయట చూడగల్గుతాము.
మరుసటి రోజు ఉదయాన్నే డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జి కు ట్రెక్కింగ్ కు బయలు దేరాం. కొండలకు చిల్లులు పడ్డట్టు ఈ కొండకు చూసిన జల పాతాలే. గోధుమరంగు కొండకు ఆకు పచ్చని చెట్లు తెల్లని జల ధరల ప్రవాహాలు...చూడ తనివి తీరదు. దాదాపు 3600 మెట్లు దిగి కిందకు అట్టడుగున అల్లంత దూరంలో ఉన్న డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఒక గైడ్ సాయంతో చూసి సాయంత్రం నాలుగు వరకు రూమ్ కు చేరుకున్నాం. మధ్యలో ఒక వ్యూ పాయింట్ ,జిప్ లైనింగ్, ఒక మార్కెట్ ఉంటాయి.
ఈ ట్రెక్కింగ్ సహజ అడవుల్లో పురుగు, పుట్ట ,ఆకు,పోక చూస్తూ వెళ్లి వస్తాం.
6. ఆరవ రోజు:
మర్నాడు నౌకాలఖి జలపాతం చూడ్డానికి వెళ్తే మబ్బులు మా కళ్ళ ముందే జలపాతాన్ని కప్పేసి అక్కడేం లేదు అన్నట్టుగా చేసే సుందర దృశ్యాన్ని వీక్షించాము. ఆర్వా గుహలని మన బెలూమ్ ,బుర్ర గుహాలలా లోపల అంతస్తులతో జలపాతాలతో గోడలపై పురాతన కాలం. నాటి శిలాజలతో ఉంటుంది . ఇంకా అక్కడ డైథిలిన్ ఫాల్స్, మైసమై గుహలు కూడా ఉంటాయి. ( చాలా జలపాతాలు ఉంటాయి).
గార్డెన్ ఆఫ్ కేవ్స్- కాబ్రి కి సింరంగ్: దారిలో హై వే కి కొంచెం లోగా వెళ్తే ఈ గుహలు జలపాతాలు చూడవచ్చు. ఏంతో ప్లానింగ్ తో ఇక్కడ దాదాపు ఒక పది కి పైగా రకరకాల సైజుల జలపాతాలు.. గుహలు చాలా మంచి అనుభూతినిస్తాయి. ఓషధ గుణాలన్న ఒక చిన్ని జలపాతం కూడా ఉంది. ఆ నీళ్లు తాగితే అన్ని జబ్బులు తగ్గి ఆరోగ్యం గా ఉంటారని నమ్మకం. మా తిరిగు టపా చివరి రోజు గౌహతి లో కొంచెం చూద్దామని షిల్లాంగ్ కు దగ్గరగా ఉన్న మైలాంగ్ గ్రామంలో రాత్రికి బస చేసాం. ఇక్కడ ఒక ఎకో పార్క్(సూర్యాస్తమయం చూడొచ్చు), నది ఉన్నాయి.
7. ఏడవ రోజు:
ఉదయాన్నే 5 గంటలు గౌహతి బయలుదేరి బ్రహ్మపుత్ర నది చూసాం. ఫెర్రి లో మధ్య ఓ ఒక ద్వీపం లో ఉన్న ఉమానంద గుడి చూడాలనుకున్నా, అస్సాం లో బ్రహ్మపుత్ర వరదల కారణంగా అనుమతించలేదు. సుప్రసిద్ధమయిన శక్తిపీఠం కామాఖ్య దేవి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ తక్కువ లో తక్కువ 4 గంటల సమయంపడుతుంది. లేదా కొన్ని నెలల ముందే దర్శనం బుక్ చేసుకోవాలి. కోరికలు తీర్చే దేవత గా ప్రసిద్ధి. ఆ తర్వాత కొంచెం దూరం లో ఉన్న బాలాజీ గుడి కూడా దర్శించుకొని ఎయిర్ పోర్ట్ బయలు దేరాం.
విపరీతంగా ఉన్న వర్షాల కారణం గా సెవెన్ సిస్టర్ లేక్స్, వాటర్ ఫాల్స్, ప్రపంచంలో నే అతి స్వచ్ఛమైన నది (డౌకి ) చూడలేక పోయాం.
Akshara roopamlo nee anubhoothini chakkagaa ponduparichaavu.
ReplyDelete