సనాసర్ - ప్రకృతి తో సహవాసంవై .హెచ్. ఏ. ఐ గురించి నేను ఈనాడు అనుబంధ పుస్తకం లో 2008 లో మొదటి సారిగా చదివినప్పట్నుంచి ప్రతి సంవత్సరం వేసవిలో ఎంతో చవగ్గా , రోటీన్ కి భిన్నం గా వుండే  వారి యాత్రలకి వెళ్ళాలనుకోవటం , అనివార్య కారణాలవలన  వెళ్ళలేకపోవటం జరుగుతున్నది.ఈ సంవత్సరం మాత్రం అలా కాకూడదని నేను మా చిన్నబ్బాయి, అక్క కూతురు  బయల్దేరాం . అందుబాటులో  వుండి అదీ తక్కువ రోజుల్లో  వున్న సాహసయాత్రల్లో ఒకటైన "సనాసర్ అడ్వెంచర్ కాంపింగ్ "ఎంచుకున్నాం. హైదరాబాద్  నుంచి డిల్లీ కి రాను పోను విమానంలో బుక్ చేసుకున్నాం అంతే. డిల్లీ కి వెళ్ళింతర్వాత అక్కడనుంచి జమ్ము కి రైళ్ళు, బస్సు సౌకర్యం వుంటుంది .(సుమారు 650 కి. మీ) పన్నెండు గంటల ప్రయాణం . అలా ఉదయం 8 గంటలకి జమ్ము చేరుకున్నాం. ఇంటర్నెట్  లో చూసినదాని ప్రకారం   జమ్ము నుంచి సనాసర్ 130 కిమీ. ఉదంపూర్ , కుడ్, పట్నిటాప్  మీదుగా సనాసర్ చేరుకో వచ్చు.

జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్ళే హై వే నంబర్ 1 పైనే సుమారు 110  కిమీ వెళ్తే పట్నిటాప్ చేరుకోవచ్చు . అదే కార్గిల్, లేహ్ వెళ్ళే దారికుడాను. బస్సులు ,శ్రీనగర్ వెళ్ళే షేరింగ్ వాహనాల లో   కూడ పట్నిటాప్ వెళ్ళవచ్చు. దారి మొత్తం జమ్మూ లోని హిమలయాలలోని మొదటి వరస పర్వత శ్రేణి శివాలిక్ లు , వాటి మధ్య లోయలలో పారే తావి నది వీక్షకుల  కనుల విందు చేస్తాయి .

దారిమొత్తం పర్యాటకుల వాహనాలతో, శ్రీనగర్ కు సరుకుల రవాణా చేసే వాహనాలతో చాలా సందడిగా వుంది.  దాదాపు ప్రతి మైలుకి భారత ఆర్మీ జవాన్లుతమ విధులు నిర్వహిస్తూ  కనిపిస్తుంటారు.  జమ్మూ నుంచి బయల్దేరినుంచి ఎంతో వేడిగా వున్న వాతావరణం అలా మా గమ్యస్థానం దగ్గరవుతున్నకొద్దీ శీతల  గాలులు  పలకరించసాగాయి. అలా ఐదు గంటలు ప్రయాణం తర్వాత 3000 మీటర్ల ఎత్తు శివాలిక్ కొండ అంచున లోయలో వున్న సనాసర్ కు చేరుకున్నాం.

సన మరియు సర్ అనే నదుల మధ్యలో వున్నందున ఈ ప్రాంతానికి సనాసర్ అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఇక్కడ జమ్ము & కాశ్మీర్ టూరిజం వారి విడిదులు, అలాగే కొన్ని ప్రైవేటు రిసార్టులు వున్నాయి. మేము వెళ్లిన రిసార్టు లో టెంట్లలో మా వాసం.మూడు రోజులు రోజూ  కొన్ని కార్యక్రమాలు వున్నాయి.

వెళ్ళగానే ఎంతో ఆదరం గా మమ్మల్ని ఆహ్వానించి వేడివేడిగా భోజనం కొసరి కొసరి వడ్డిచ్చారు. కాసేపు విశ్రాంతి తీసుకొని  ఆ ప్రాంతం అంతా అలా చుట్టి వచ్చాం.
అక్కడక్కడాకనిపించే మంచు కొండల్, మామూలు పర్వతాలు, లోయలు, పచ్చిక మైదానాలు, దేవదారు, కోనిఫెర్ వృక్షాలు, సెలయేళ్ళు అక్కడి కొండ ప్రాంతపు నిష్కల్మషమైన మనుషులు వారి అభిమానాలు మనల్ని ఉ క్కిరి బిక్కిరి చేస్తాయి. ఆ రిసార్టు యజమాని ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్  .ప్రకృతి పై మమకారంతో ఇక్కడ ఇది హాబీ గా  నిర్వహిస్తుంటారు. వారాంతం లో మరియు వేసవి సెలవులు మొత్తం వారి కుటుంబం ఇక్కడే గడుపుతుంతారు.  జమ్మూ మరియు ఉత్తర భారతం లో జూన్ లో వేసవి సెలవులవటం వలన ఎక్కువ రద్దీ లేదు. (మేము మే లో వెళ్ళాం )  


మొదటి రోజు ఆ జిల్లాలోనే ఎత్తయిన పర్వతం  మీద వున్న శంఖ్ పాల్ గుడి కి ఒక గైడ్ సహాయంతో  (3000 మీ) ట్రెక్కింగ్ చేస్తూ బయలు దేరాం. అక్కడక్కడా ఆగుతూ నాలుగు గంటలలో పైకి చేరుకున్నాం. పైకి ఎక్కుతున్నప్పుడు దూరంగా శ్రీనగర్  మంచు కొండలు కూడ స్పష్టంగా కనిపించసాగింది.  ఆ  కొండలపై  అక్కడ అక్కడ విసిరేసినట్టు వున్న మట్టి ఇళ్ళలో గుజ్జర్లు నివసిస్తుంటారు. వీరు ఎక్కువ శాతం దేశదిమ్మర్లు. పశువుల పెంపకం మరియు వ్యవసాయం వీరి ప్రధాన వృత్తులు.వీరు ఎంతో కష్ట జీవులు. వేసవిలో 
సనాసర్ కు చలికాలంలో జమ్ము కు కుటుంబం, సామన్లు మరియు పశువులతో నడుస్తూ వలస వెళ్తుంటారు.

అలా పైపైకి వెళ్ళే కొద్ది కొంత సూర్యుడి ప్రతాపమున్నా చల్లటి గాలి వీయడంతో ఎంతో, హాయిగ మేఘాలు అలా అందుకొని వెళ్ళొచ్చేమో అనిపించేలా...  ప్రపంచాన్ని అధిరోహించిన భావన కల్గింది. మా అబ్బాయి అయితే నాకు ఇక్కడే  వుండిపోవాలని వుంది అని ఎంతో ఆనందంగా గంతులు వేయసాగాడు.

 తిరిగి కిందకి వచ్చే సరికి వారం రోజులు నడకతోనే రకరకాల ప్రదేశాలు తిరుగుతూ వస్తున్న 12 మంది బృందం ఒకటి వచ్చింది. ఆశ్చర్యకరంగా ఆ బృందంలో పదిమంది 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు  వున్నారు. వారంతా ఎంతో చలాకిగా ,ఆనందంగా, ఇష్టం గా వారి ట్రెక్కింగ్  కొనసాగిస్తున్నారు.

ఆ రోజు సాయంత్రం గుర్రం స్వారీ కూడ చేసాం. మరుసటి రోజు ఉదయాన్నే  వాతావరణం చాలా ఆహ్లాదంగా వుండటం తో రాక్ క్లైంబింగ్    మరియు రాపెల్లింగ్ చేయటానికి  కింద ఒక పెద్ద లోతైన లోయ తో నిట్ట నిలువుగా వున్న ఒక కొండపైకి వెళ్ళాం . సాయంత్రం  విలువిద్య, రైఫిల్ షూటింగ్ కూడా చేసాం.

మరో రోజు ఆ పక్కనే వున్న ఒక జలపాతాన్ని చూసి ,స్నానాలు  చేసి  ఆ చుట్టూ వున్న ప్రదేశాలన్ని  చూసాము. అక్కడ వున్న గుడి లోని నాగదేవత ఎంతో మహిమ వుందని అక్కడివాళ్ళ  నమ్మకం.  ఆ రిసార్టు యజమాని కుటుంబం మొత్తం మాతో గడపడం తో మాకు అసలు సమయమే తెలియలేదు.

ఆ వూరిలొనే "జవహర్ మౌంటనీరింగ్ ఆండ్ వింటర్ స్పొర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ " శీతాకాలంలో పిల్లలకు సాహస ఆటలు నేర్పిస్తారు .దాదాపు 200 మంది పిల్లల్తో,శిక్షకులతో కళకళలాడుతూంది.

మూడో రోజు ఆక్కడ టాపి నదిలో కాసేపు సమయం గడిపి డిల్లీ వెళ్ళటానికి ఉధంపూర్ రైల్వే స్టేషన్  చేరుకున్నాము.ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు పుస్తకం లోని నాయని  కృష్ణకుమారి రాసిన "కాశ్మీర దర్శనం"  పాఠం లోని  వర్ణనలను ప్రత్యేకించి జమ్ము, ఉధంపూర్ నెమరువేసుకుంటూ  తిరుగు ప్రయాణమయ్యాము.        

దుశ్శాలువా

(ఈ అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతం. ఎవర్ని ఉద్దేశించినవి కాదు.) నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో  కలవటానికి వచ్చిన ఉద్యోగులు సెక్షన్ల ...