నేను - మా నాన్న మొక్కుబడి

మా ఇంటి  దగ్గర్లో వున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం  లో   రాములవారికి మరియు ప్రత్యేకంగా  రాముని పై  తనకున్న స్వామి భక్తిని చాటుతూ స్వామినే చూస్తూ ఎదురుగా చేతులు జోడించి నిల్చున్న   హనుమంతుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రెండు........ అని లెక్క పెట్టుకొని ఇంకా నూట ఆరు.... లెక్క పెట్టుకుంటున్నాను.


ఇంతకీ విషయం లోకి వస్తే.....

అమెరికా లో బి బి ఎ చదవడానికి కావాల్సిన పరీక్షలకు అప్లై చేస్తూ పాస్ పోర్ట్ అవసరమై అలమరా లో వెతికాను. ఎక్కడా కనిపించక పోవటం తో అమ్మను అడిగాను . అలమార లోనే వుంటుంది చూడు అన్నది పని లో బిజి గా వుండటం తో.ఎంత వెదికినా దొరకడం లేదు. నాన్న కుడా వెదకటం   మొదలు పెట్టాడు ..  ఏమి  లాభం లేదు అని ఇక ఆఫీస్ కి వెళ్లి పోయారు నాన్న, మమ్మల్ని వెతకమని .....


ఇంట్లో ఎన్ని అలమారాలు, లాకర్లు  వున్నా దీవాన్ పరుపు కింద లేదా వంటిట్లోని  డబ్బాల్లోనే విలువైన  సామాన్లు దొరుకుతాయి సాధారణంగా . మా ఇల్లు అందుకు అతీతమైంది ఏమీ కాదు. సరే అంతటా వెతకటం అయ్యింది. మా అన్నయ్య కొంచెం సీరియస్ గా వెతికి లేదని తేల్చాడు. మెల్లగా నాకు భయం మొదలయింది, అప్పటివరకు ఈగ కూడా వాలనట్టుంది అమ్మ, ఇంత జరుగుతున్నా కూడా. అన్నయ్య ఇక గట్టిగా లేదనేసరికి అమ్మ వెతకటం మొదలు పెట్టింది మెల్లగా ...ఎక్కడకి పోతుంది వీళ్లకు ఏది దొరుకుతుంది గనక అన్న ధీమాతో. అందులో నేనెప్పుడూ అమ్మకి దొరకని వస్తువు ఇక ప్రపంచంలో ఎవరికీ దొరకదు అని  కితాబులు కూడా ఇస్తూఉంటా .( అందులో కొంత నిజం ..కొంత వెతకటానికి బద్ధకం తో ).  మొదలయ్యింది పాస్ పోర్ట్ వేట. అరగంట దాటింది దొరకడం లేదు. మెల్లగా అన్నయ్య  పాస్ పోర్ట్ పొతే ఎలా అంటూ గూగుల్ తల్లి ని అడగటం మొదలెట్టాడు.

పాస్ పోర్ట్ డూప్లికేట్ తెచ్చుకోవటం పెద్ద కష్టం కాదు కానీ అందులో వున్నా 10 ఏళ్ళ యూస్ వీసా   మాత్రం రాదు మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేసి తెచ్చుకోవాల్సిందే  అన్నాడు నిట్టూరుస్తూ. మనసులో కంగారు మొదలయ్యింది. అప్పుడు  అందరూ చివరగా ఎప్పుడు చూసావో గుర్తు తెచ్చుకో అన్నారు . SAT పరీక్షకి ID ప్రూఫ్  కోసం తీసుకెళ్ళాను అమ్మా అదే లాస్ట్  అన్నాను , నాకు అదే గుర్తుంది మరి . పుస్తకాల సంచి లో, కారు లో ఆ రోజు  పరీక్షకి  తీసుకెళ్లిన అన్ని వస్తువుల్లో వేసుకున్న బట్టలతో సహా వెతికాం... ప్చ్ ...అబ్బె లాభం లేదు.


అమ్మ మొహం కొంచెం గంభీరం గా మారింది. చివరిసారి ఇల్లు సర్దినప్పుడు చిన్నప్పటి పాత పాస్ పోర్ట్ లు నీది అన్నయ్యది చూసి అక్కర్లేదని చింపేసి పడేసినట్టున్నాను రా సరిగ్గా గుర్తు రావటం లేదు, అది ఇదే కాదు కదా అంది.  ప్రపంచంలో దేనికైనా పరిష్కారాలు ఉంటాయి, లేదా మళ్ళీ అవకాశాలు వస్తాయి అని గట్టిగా నమ్మే అమ్మ చాలా బాధ పడుతోంది , కారణం త్వరలో నేను UG కి అప్లై చేయాలి వీసా కు వెళ్ళాలి, అంతలో సజావుగా జరగ కుండా ఇదంతా ఏంటని ...

నాన్న ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి దొరికిందా అని .లేదన్నాము. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు వెళ్ళినప్పుడు జిరాక్స్ ఇచ్చావు చూడు అన్నారు. అవును .. మా ఇంటికి నాలుగు ఇళ్ల అవతల ఒక షాప్ వుంది అక్కడ జిరాక్స్ తీసుకొని నాన్నకు ఇచ్చాను . కానీ నేను ఒరిజినల్ తెచ్చాను నాన్నా అన్నాను.

అమ్మతో చెప్పాను  ఇదే విషయం. ఎందుకైనా మంచి ఒకసారి వెళ్లి అడుగు అంది . అప్పటికి ఇంకా షాపులు తీసే సమయం కాలేదు. పైగా ఇదంతా జరిగి రెండు నెలల పైనే అయ్యింది. ఒకవేళ అక్కడే మర్చిపోయినా దొరికేది కష్టమే . 10 గంటల దాకా  అతికష్టం మీద ఆగి షాపు కు బయలు దేరాను , వెళ్తూ అమ్మని రమ్మన్నాను ధైర్యం కోసం . సరేనంది అమ్మ, ఇద్దరం వెళ్ళాం . తీరా చూద్దుము గదా అక్కడ జిరాక్స్ షాపు బదులు ఒక పుస్తకాల షాపు పెట్టారు ఈ మధ్యనే ( అయినా ఆ జిరాక్స్ మెషిన్  , ఇంటర్నెట్ కూడా వున్నాయి ఇంకా అందులోనే  ) అంతే    సంగతులు అనుకున్నాం. ఒక మధ్య వయసు వ్యక్తి వున్నాడు అక్కడ .. ఇక్కడ ఏమయినా పాస్ పోర్ట్ మర్చి పోయామా అని అడిగాం.

పాస్ పోర్టా... లేదే అన్నాడు . ఇక్కడ ఒక అమ్మాయి ఉండేది కదా ముందు తనతో జిరాక్స్ చేయించుకొని ఇక్కడే మర్చి పోయామండి కొంచెం చూడరా... ప్లీజ్ అన్నాం . సరే అన్నట్లు తలాడించి డ్రా తెరిచాడు .... రబ్బర్ బ్యాండ్ వేసి వున్న ఒక కట్ట తీసాడు . పాన్ కార్డు లు , ఆధార్ కార్డు లు, పెన్ డ్రైవ్ లు, డ్రైవింగ్ లైసెన్సులు ఎన్నో వున్నాయి వాటిలో . ఎవరు ఏది మర్చి పోయినా మేము ఇలా జాగ్రత్త గా తీసి వుంచుతాము అన్నాడు.   కానీ పాస్ పోర్ట్ లు ఏమి లేవు అన్నాడు. ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే పని చేస్తోంది  ఇంకో గంటాగి వస్తుంది రాగానే కనుక్కుంటాను అన్నాడు. అప్పుడు చెప్పాం మా బాధ ,ఎందుకు అది అత్యవసరమో . అవునా అని మా బాధకు మద్దతు ప్రకటించి చూస్తాం లెండి అన్నాడు. మేము మళ్ళీ ఒకసారి గట్టి గా చూడండి అని నొక్కి నొక్కి చెప్పి వస్తుంటే , అందులో ఫోటో ఉందా అని ఆరా తీశాడు . ఆ మా అబ్బాయిది కానీ చిన్నప్పటి మొహం ఉంటుంది అని అన్నది అమ్మ . అలా వచ్చేస్తుంటే ఒక నిమిషం అని ఆ లోపల వున్న మరో డ్రా తెరిచాడు మేమిద్దరం వెళ్లి అందులో తల దూర్చి చూసాం ...ఒక నల్లని పాస్ పోర్ట్  దానిపై స్టికర్ లో మాధవన్ అని పేరు అంతే.. అదే అంకుల్  అదే అంటూ లాక్కున్నంత  పని చేసాం . అతనికి పదే పదే థాంక్స్ చెప్తూ వచ్చేసాం, అది కలనో ..నిజమో  .. తెలియని పరిస్థితిలో ..

ఇంటికి వచ్చి నాన్నకి చెప్తే వెంటనే చెప్పాడు ....రామాలయంలో ఆంజనేయస్వామి కి 108  ప్రదక్షిణాలు చేస్తావని దండం పెట్టాను దొరికితే అని.  అదే ఇది. ( నాన్నెప్పుడూ ఇంతే , ఇంతకు ముందు ఒకసారి  నానమ్మను తిరుపతి తీసుకొస్తానని మొక్కాడు.నానమ్మ వెంట్రుకలు ఇస్తానని ఇలా ఇది వంశాచారం ).

( ఆ తర్వాత అప్లై చేయడం అన్నింటిలో సీట్ రావటం స్కాలర్షిప్ కూడా దొరకటం అన్ని జరిగాయి )

దుశ్శాలువా

(ఈ అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతం. ఎవర్ని ఉద్దేశించినవి కాదు.) నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో  కలవటానికి వచ్చిన ఉద్యోగులు సెక్షన్ల ...